కోవింద్ ప్రమాణస్వీకారం నేడే

July 25, 2017


img

భారతదేశ 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఎంపిలు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధదళాల అధిపతులు, రాయబార కార్యాలయల ప్రతినిధులు తదితరులు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిల్లీ చేరుకొన్నారు.

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాబోయే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇరువురూ కలిసి పార్లమెంటు సెంట్రల్ హాల్ చేరుకొంటారు. అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ రాంనాథ్ కోవింద్ చేత ప్రమాణస్వీకారం చేయించిన తరువాత ప్రణబ్ ముఖర్జీ తన స్థానంలో ఆయనను కూర్చోబెట్టి, తను వేరే కుర్చీలోకి మారుతారు. అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన వారిని, దేశప్రజలను ఉద్దేశ్యించి రాంనాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. దానితో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగుస్తుంది. అప్పుడు రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ కు, ప్రణబ్ ముఖర్జీ  10, రాజాజీ మార్గ్ లో తనకు కేటాయించిన ప్రత్యేక బంగళాకు బయలుదేరి వెళతారు. 

కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ప్రణబ్ ముఖర్జీ 2014ఎన్నికల తరువాత కేంద్రంలో యూపియే ప్రభుత్వం స్థానంలో భాజపా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ దానితో కూడా చక్కటి అవగాహన, సత్సంబంధాలు కలిగి ఉన్నారు. మోడీ సర్కార్ కూడా ఆయనను అంతే గౌరవించింది. మొన్న పార్లమెంటు సెంట్రల్ హల్లో జరిగిన వీడ్కోలు సభలో అది కళ్ళకు కట్టినట్లు కనబడింది. ఇప్పుడు మోడీ స్వయంగా ఎంపిక చేసుకొన్న రాంనాథ్ కోవింద్ రాష్ట్రపతి అవుతున్నారు కనుక ప్రభుత్వానికి, ఆయనకు మద్య ఇంకా మంచి అవగాహన, బలమైన సంబంధాలు నెలకొనే అవకాశం ఉంది.     



Related Post