ఆ విషయంలో కూడా ఆశ్రద్ద చూపారు అందుకే..

May 25, 2017


img

సికింద్రాబాద్ లోని రక్షణశాఖకు చెందిన బైసన్ పోలో, జింఖానా మైదానంలో సచివాలయం నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ అప్పుడే కాంగ్రెస్, ప్రొఫెసర్ కోదండరామ్, కొందరు స్థానికులు అప్పుడే దానిని వ్యతిరేకిస్తూ ఆందోళన మొదలుపెట్టారు. ప్రజలకు ఉపయోగపడుతున్న పెరేడ్ గ్రౌండ్స్ లో సచివాలయం నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తామని తేల్చి చెప్పారు. 

దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ అక్కడే సచివాలయం ఎందుకు నిర్మించాలనుకొంటున్నారో వివరణ ఇచ్చారు. ప్రగతి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అక్కడ సచివాలయం నిర్మిస్తున్నప్పటికీ పెరేడ్ గ్రౌండ్స్ ను ముట్టుకోము. అది యధాతధంగా ఉంటుంది. ఇంతవరకు అక్కడ మనం ఏదైనా వేడుకలు జరుపుకోవాలంటే డిల్లీకి లేఖలు వ్రాసుకొని అనుమతులు తెచ్చుకోవలసి వచ్చేది. ఇంతకాలం సమైక్య రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ఇంత చిన్న విషయం కూడా పట్టించుకోకపోవడం వలననే ఈ సమస్య ఉండిపోయింది. ఇకపై పెరేడ్ గ్రౌండ్స్ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది కనుక మనం ఎవరి అనుమతుల కోసం ప్రాధేయపడనవసరం ఉండదు,” అని వివరించారు.

ఇక నూతన సచివాలయం గురించి వివరిస్తూ, “సచివాలయం ఒక్కటే కాకుండా దానిని ఆనుకొనే శాసనసభ, మండలి భవనాలు కూడా నిర్మిస్తాము. వాటికి సమీపంలోనే మన తెలంగాణా సంస్కృతీ సంప్రదాయలను ప్రతిభింబించే విధంగా తెలంగాణా కళాభవన్ కూడా నిర్మిస్తాము. అక్కడ అవసరమైనంత స్థలం ఉంది కనుక అందరికీ అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. నగరం నడిబొడ్డుణ ఉంటుంది కనుక అక్కడికి చేరుకోవడం తేలిక,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.


Related Post