ప్రతిపక్షాల దెబ్బకి రూ.3000 కోట్లు ఫట్!

April 20, 2017


img

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో ఈవిఎంల ట్యాంపరింగ్ జరిగిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవిఎంలను పక్కనబెట్టి, రూ.3,000 కోట్లు పెట్టి ఓటర్లకు రశీదు కూడా ఇచ్చే (ఓటర్ వేరిఫిడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఈవిఎంలను కొనుగోలు చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్దం అవుతోంది. సుప్రీంకోర్టు కూడా 2019 ఎన్నికలలో ఆ కొత్త ఈవిఎంలనే ఉపయోగించాలని ఆదేశించడంతో కొత్త ఈవిఎంల కొనుగోలు అనివార్యం అయ్యింది.

అయితే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవిఎంలలో ఎటువంటి లోపాలు లేవని, వాటిని ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని ఎన్నికల కమీషన్ గట్టిగా వాదిస్తోంది. అంతేకాదు..వాటిని ట్యాంపరింగ్ చేసి చూపమని ప్రతిపక్షాలకు, సాంకేతిక నిపుణులకు సవాలు విసిరింది. ఒకపక్క ఈసి ఇంత నమ్మకంగా ఈవిఎంల గురించి చెపుతుంటే, ప్రతిపక్షాల ఒత్తిళ్ళకు లొంగి రూ.3000 కోట్లు ఖర్చు చేసి వాటికి రశీదులు ఇచ్చే మెషిన్లని కొనుగోలు చేయబోతోంది. కానీ 'అసలు ఈవిఎంలే వద్దు..మళ్ళీ బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని' పట్టుబడుతున్న ప్రతిపక్షాలు రశీదులు ఇస్తామంటే అంగీకరిస్తాయా? అంటే అనుమానమే. అప్పుడు వాటిని కూడా ప్రభుత్వం పక్కన పెడుతుందా?

ఈవిఎంలలో లోపాలు ఉండి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి కానీ విమర్శలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వేల కోట్లు ఖర్చు చేసి రశీదులు ఇచ్చే మెషిన్లని కొనడం సరికాదనే చెప్పాలి. ఒకవేళ వాటిని కొనవలసి వచ్చినా చైనా నుంచి తెప్పించుకోవడం కంటే మన దేశంలోనే తయారైనవి కొనుగోలు చేయడం మంచిది. కనీసం ఆవిధంగానైన అంత డబ్బు బయటకు పోకుండా దేశంలోనే ఉంటుంది. 


Related Post