తాశీల్దార్లకు టార్గెట్స్ ఏల? కిషన్‌రెడ్డి ప్రశ్న

January 25, 2021


img

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలిసి ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ తాశీల్దార్ల సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణలో పాలన సంస్కరణలను సరిగా అమలు చేయడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం తాశీల్దార్లకు ప్రతీరోజు టార్గెట్స్ నిర్దేశిస్తుండటంతో రాష్ట్రంలో వారిపై పనిభారం చాలా ఎక్కువైందని, ఆ కారణంగా ధ్రువపత్రాల జారీ ఆలస్యం అవుతోందని దాంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనుక వారిపై పని ఒత్తిడి తగ్గించాలని అన్నారు. అలాగే విఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలని అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ వాటి ప్రకారం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయలేని దుస్థితి నెలకొని ఉందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తక్షణమే అన్ని ప్రభుత్వ శాఖలలో పదోన్నతులు చేపట్టాలన్నారు.



Related Post