నేటి నుంచి కొత్త పార్లమెంటు భవన నిర్మాణపనులు షురూ

January 15, 2021


img

నేటి నుంచి కొత్త పార్లమెంటు భవనం నిర్మాణపనులు ప్రారంభం కానున్నాయిఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న టాటా సంస్థ . సెంట్రల్ విస్టా పేరుతో కొత్త పార్లమెంటు భవనంతో పాటు కేంద్రమంత్రులు, ఎంపీల కార్యాలయాలు వగైరాలను నిర్మించబోతోంది. 2022 అక్టోబర్ నాటికల్లా దీని నిర్మాణపనులు పూర్తిచేయాలని కేంద్రప్రభుత్వం గడువు విధించింది. 

కొత్త పార్లమెంటు భవనం నిర్మాణంలో ఇంజనీర్లు, అధికారులు, కార్మికులు కలిపి సుమారు 2,000 మంది పనిచేస్తారు. పరోక్షంగా...అంటే పార్లమెంటు భవన నిర్మాణానికి అవసరమైనవాటిని తయారుచేసి అందించేందుకు మరో 9-10,000 మంది వరకు పనిచేస్తారు. భారతదేశ ప్రజాస్వామ్య ఔనత్యాన్ని, సంస్కృతీ సాంప్రదాయాలను చాటిచెప్పేవిధంగా నిర్మించబోతున్న కొత్త పార్లమెంటు భవనానికి 200 మందికి పైగా హస్తకళాకారులు తుదిమెరుగులు దిద్దుతారు.           

 ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనానికి ఎదురుగానే త్రిభుజాకారంలో ఈ కొత్త పార్లమెంటు భవనం నిర్మించబోతున్నారు. రూ.971 కోట్లు వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించబోతున్నారు. దీనిలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులు కలిపి మొత్తం 1,272 మంది సమావేశమయ్యేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. 

ఈ కొత్త పార్లమెంటు భవనానికి సమీపంలో ప్రస్తుతం ఉన్న శ్రమశక్తి భవన్ స్థానంలో మరో కొత్త భవనాన్ని నిర్మిస్తారు. దీనిలో ఎంపీల కార్యాలయాలు ఉంటాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు వారు అక్కడి నుండి నేరుగా పార్లమెంటులోకి ప్రవేశించేందుకు వీలుగా ఓ సొరంగమార్గాన్ని కూడా ఏర్పాటుచేయబోతున్నారు. ఎప్పుడైనా అవాంఛనీయఘటనలు జరిగితే ప్రధానమంత్రితో సహా అందరూ దాని ద్వారా సురక్షితంగా బయటపడవచ్చు. మొదట కొత్త పార్లమెంటు భవనం నిర్మాణపనులు పూర్తిచేసిన తరువాత 2024లోగా ఎంపీల కోసం కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు.


Related Post