జనగామలో ఉద్రిక్త పరిస్థితులు

January 13, 2021


img

జనగామలోని భాజపా కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జనగామ మున్సిపల్ సిబ్బంది వెంటనే వచ్చి స్వామి వివేకానంద ఫ్లెక్సీని పోలీసుల సహాయంతో తీసేసారు. ఆ సందర్భంలో భాజపా శ్రేణులకుపోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో పోలీసులు సహనం కోల్పోయి భాజపా శ్రేణులపై లాఠీ ఛార్జ్ చేయగా స్థానిక భాజపా కార్యకర్త పవన్ శర్మకు గాయాలయ్యాయి. భాజపా కార్యకర్తలు అతనిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ జనగాలో పోలీసుల తీరుకు నిరసనలు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బండి సంజయ్ కూడా ఇవాళ్ళ ఉదయం జనగామకు వెళ్ళి కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా హాస్పిటల్‌కు  వెళ్లి అక్కడ చికిత్సపొందుతున్న భాజపా కార్యకర్త పవన్ శర్మను పరామర్శించారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ శాంతియుతంగా  నిరసన తెలుపుతున్న తమ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లాఠీ ఛార్జ్ చేశారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై, వారికి ఆదేశాలిచ్చిన అధికారులపై తక్షణం కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

జనగామలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. 


Related Post