ధరణీపై హైకోర్టు స్టే పొడిగింపు

December 04, 2020


img

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణీ పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై విధించిన స్టే ఉత్తర్వులను డిసెంబర్‌ 8వరకు హైకోర్టు పొడిగించింది. అలాగే తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ధరణీలో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి ప్రజల వ్యక్తిగత వివరాల నమోదు చేయరాదంటూ తాము జారీ చేసిన ఆదేశాలు యధాతధంగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. 

ధరణీపై దాఖలైన ఏడు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టినప్పుడు జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు.  స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ కోసం ప్రభుత్వం చేసిన సంస్కరణలు, ప్రవేశపెట్టిన ధరణీ, దాని విధివిధానాలు అన్నీ బాగున్నాయని ప్రశంశిస్తూనే, “రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం-2020లో ధరణీ ప్రస్తావన, ఆర్‌ఓఆర్‌ల ప్రస్తావన లేదని, ధరణీలో ఆధార్, బ్యాంక్ ఖాతా వంటి వ్యక్తిగత వివరాలు మరియు ఆస్తుల వివరాలను నమోదు చేసుకోకపోతే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఆస్తుల రిజిస్ట్రేషన్స్ చేస్తారా లేదా?ధరణీలో నమోదు చేసుకోకపోతే భవిష్యత్‌లో ఆ ఆస్తులపై ఎటువంటి లావాదేవీలకు అనుమతించకూడదని ప్రభుత్వం భావిస్తోందా?” అని ప్రశ్నించారు.

న్యాయస్థానం, పిటిషనర్లు లేవనెత్తిన సందేహాలకు డిసెంబర్‌ 8వ తేదీన సమాధానం చెప్పాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆరోజుకి విచారణను వాయిదా వేసింది.  


Related Post