కౌంటింగ్ సాగుతుండగా హైకోర్టులో పిటిషన్‌

December 04, 2020


img

రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న అర్ధరాత్రి జారీ చేసిన తాజా ఆడీశాన్ని సవాలు చేస్తూ బిజెపి కొద్దిసేపటి క్రితం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్‌ వేసింది. రిటర్నింగ్ అధికారులు ఇచ్చే స్వస్తిక్ గుర్తున్న రబ్బరు స్టాంప్‌కు బదులు సంబందిత పోలింగ్ కేంద్రానికి సంబందించిన ఏ స్టాంపుతో బ్యాలెట్ పేపర్లపై ముద్ర వేసినా ఆ ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీనినే సవాలు చేస్తూ బిజెపి హైకోర్టును ఆశ్రయించింది. 

ఎన్నికల నియమావళి ప్రకారం రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన స్వస్తిక్ గుర్తున్న రబ్బరు స్టాంప్‌తోనే ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్ధికి ఎదురుగా ముద్రవేయవలసి ఉంటుంది. కనుక పెన్నుతో లేదా వేరే స్టాంపుతో ఓటు వేయకూడదు. కానీ అధికార టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలకు లబ్ది చేకూర్చేందుకే ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీ చేసిందని బిజెపి ఆరోపిస్తోంది.

ఝాన్సీబజార్, పురానాపూల్ డివిజన్‌లలో సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత మజ్లీస్‌ పార్టీ బూత్ క్యాప్చరింగ్ చేసి రిగ్గింగ్ చేసిందని బిజెపి ఆరోపిస్తోంది. ఆ ప్రయత్నంలోనే మజ్లీస్‌ కార్యకర్తలు బ్యాలెట్ పేపర్లపై వేరే స్టాంపుతో ఓట్లు వేయించేసి ఉండవచ్చని బిజెపి వాదిస్తోంది. అధికార టిఆర్ఎస్‌, మజ్లీస్‌ కనుసన్నలలో నడుస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగులో ఎన్ని అవకతవకలు జరుగుతున్నా పట్టించుకోలేదని, కనీసం తమ ఫిర్యాదులను స్వీకరించుకోలేదని బిజెపి వాదిస్తోంది. కనుక అటువంటి ఓట్లు చెల్లవని ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ఓట్ల లెక్కింపు మొదలైనందున దీనిపై హైకోర్టు ఏమి చెపుతుందో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హైకోర్టు ఆ ఓట్లు చెల్లవని తీర్పు చెపితే ఆవిధంగా పోలైన ఓట్లన్నీ పక్కనపెట్టకతప్పదు.


Related Post