రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇంటర్వ్యూ

November 27, 2020


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తాజా ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు: 

ప్రశ్న: హైదరాబాద్‌ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడకుండా మత రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? 

జవాబు: జనాభాలో 10-15 శాతం ఉన్నవారి గురించి మజ్లీస్‌, టిఆర్ఎస్‌లు మాట్లాడితే వాటిని సెక్యులర్ పార్టీలంటారు. జనాభాలో 80 శాతం ఉన్న(హిందువులు)వారి గురించి మేము మాట్లాడితే మతరాజకీయాలు చేస్తున్నామంటారు. ఒకవేళ మెజార్టీ జనాభా తరపున మాట్లాడటం నేరమే అయితే మేము అదే చేస్తాం.

ప్రశ్న: జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ‘పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ’ ప్రజల మద్య చిచ్చుపెట్టి నగరంలో ప్రశాంతతకు భంగం కలిగించడం తప్పు కాదా? 

జవాబు: సర్జికల్ స్ట్రైక్స్ అంటే పాతబస్తీపై బాంబులు వేస్తామని కాదు. అక్కడ అక్రమంగా స్థిరపడిన రోహ్యింగాలను గుర్తించి వారి దేశానికి తిప్పి పంపించేస్తామని నా ఉద్దేశ్యం. ఈ విషయం టిఆర్ఎస్‌, మజ్లీస్‌లకు కూడా తెలుసు. కానీ మేము ఎన్నికలలో గెలిస్తే పాతబస్తీపై బాంబులు వేస్తామన్నట్లు దుష్ప్రచారం చేస్తూ, మా పార్టీపై ప్రజలకు వ్యతిరేకత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా పాతబస్తీలో అక్రమంగా విదేశీయులకు ఆశ్రయం కల్పించి వారికి ఓటు హక్కు, రేషన్ కార్డులు ఇవ్వడాన్ని ఆ రెండు పార్టీలు సమర్ధించుకోగలవా?దేశ భద్రత, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పాతబస్తీలోని విదేశీయులను ఏరిపారేస్తామంటే టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు ఎందుకు అభ్యంతరం చెపుతున్నాయి. వారి ఓట్ల కోసమే కదా వారిని తెచ్చిపెట్టుకొన్నది?అసలు పాతబస్తీ దానిలో ముస్లిం ప్రజలు నేటికీ ఈ దుస్థితిలో ఉండటానికి కారణం టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీలే. మేము గెలిస్తే పాతబస్తీని హైదరాబాద్‌లో మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తాం. పాతబస్తీకి కూడా మెట్రోను రప్పిస్తాం. పాతబస్తీలో నిరుద్యోగయువతకు ఉద్యోగాలు లభించేలా చేస్తాం. 

ప్రశ్న: కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కనుక పాతబస్తీలో రోహ్యింగాలను మీ ప్రభుత్వమే గుర్తించి ఎందుకు పంపించలేకపోయింది? 

జవాబు: రాష్ట్రంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. కనుక ఇది దాని బాధ్యతే. ఒకవేళ అది రోహ్యింగాలపై కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపిస్తే చర్యలు తీసుకొంటుంది. కానీ టిఆర్ఎస్‌ ప్రభుత్వం అటువంటి ఆలోచన కూడా చేయలేదు. కనుక మేము జీహెచ్‌ఎంసీలో అధికారంలోకి వస్తే పాతబస్తీలో అక్రమంగా స్థిరపడినవారినందరినీ గుర్తించి తిప్పి పంపించివేస్తాము. 

ప్రశ్న: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రప్పించవలసిన అవసరం ఏమిటి? 

జవాబు: మాది జాతీయ పార్టీ కనుక జాతీయనాయకులు వస్తున్నారు. ఆందులో తప్పేమిటి?టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు ప్రాంతీయపార్టీలు. వాటికి కేవలం ఇద్దరేసి ముఖ్యనేతలు మాత్రమే ఉన్నారు. వారే ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు.

ప్రశ్న: మీ కేంద్రమంత్రులు ప్రచారానికి వస్తున్నారు కానీ హైదరాబాద్‌ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురావడం లేదు? 

జవాబు: హైదరాబాద్‌లో వరద సాయం కోసం కేంద్రప్రభుత్వం రూ.220 కోట్లు విడుదల చేసింది. మరో పద్దులో మరో రూ.200 కోట్లు విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ వివరాలను ఆధారాలతో సహా సమర్పించారు. కానీ కేంద్రం ఏమీ ఇవ్వలేదని టిఆర్ఎస్‌ అబద్దాలు చెపుతోంది. అసలు వరదనష్టం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కేంద్రానికి ఎందుకు నివేదిక పంపించలేదు? 

ప్రశ్న: టిఆర్ఎస్‌ గెలిస్తే మేయర్ పదవి మజ్లీస్‌కు ఇస్తుందని ఏవిధంగా చెపుతున్నారు?

జవాబు: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలో సిఎం కేసీఆర్‌, అసదుద్దీన్ ఓవైసీ ప్రగతి భవన్‌లో కూర్చొని చర్చించుకొని నిర్ణయిస్తారు. ఆ తరువాత ఎన్నికలలో రెండు పార్టీలు బద్దశత్రువులులాగా కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తున్నాయి. ఆ రెండు పార్టీల మద్య బందం గురించి అందరికీ తెలిసిందే. గులాబీ కారు స్టీరింగ్ మా చేతిలో ఉందని మజ్లీస్‌ నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. కనుక ఒకవేళ ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలిచినా మేయర్ పదవి మజ్లీస్‌కు సమర్పించుకోక తప్పదు. 

ప్రశ్న: టిఆర్ఎస్‌ 100 సీట్లు గెలుచుకొన్నప్పుడు మేయర్ పదవిని మేమే తీసుకొంటాము కానీ మజ్లీస్‌కు ఎందుకు ఇస్తామని మంత్రి కేటీఆర్‌ అడిగారు కదా? మా మహిళా కార్పొరేటర్‌కే మేయర్ పదవి ఇస్తామని కేటీఆర్‌ చెప్పారుగా?

జవాబు: చెప్పారు. కానీ మేయర్ పదవి మజ్లీస్‌కు ఇవ్వబోమని చెప్పలేదు కదా?

ప్రశ్న: మీరు గెలిస్తే ఒక్కో కుటుంబానికి రూ.25,000 వరద సాయం ఇస్తామని హామీ ఇచ్చారు?రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా మీరు ఎక్కడి నుంచి అంతా డబ్బు తెస్తారు? వరదలో కొట్టుకుపోయిన పాడైన బైక్‌లు, కార్లు ఇస్తామన్నారు. అది సాధ్యమేనా? 

జవాబు: ఏదోలా ఇస్తాం. అవసరమైతే కేంద్రాన్ని అడిగి తెస్తాం. ఏదో ఓ పధకం ద్వారా నిధులు మంజూరు చేయించుకొని ఇస్తాం. కొత్త వాహనాలు మేము కొనిస్తామని చెప్పలేదు. వాటికి ఇన్స్యూరెన్స్ ఉంటుంది కనుక పోలీసులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలతో మాట్లాడి వాహనాలు లేదా నష్టపరిహారం అందేలా చేస్తాము.    

ప్రశ్న: జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మీ పార్టీ గెలుస్తుందా? 

జవాబు: యస్. తప్పకుండా 100 సీట్లు గెలుచుకొని జీహెచ్‌ఎంసీలో అధికారంలోకి వస్తాము. మేయర్ పదవిని మేమే సొంతం చేసుకొంటాము.


Related Post