జమిలి ఎన్నికలకు సిద్దంకండి: ప్రధాని మోడీ

November 27, 2020


img

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి (జమిలి) ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు లోతుగా అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. గుజరాత్‌లో కెవాడియాలో గురువారం ‘80వ అఖిలభారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్’ జరిగింది. ఆ సమావేశం ముగింపులో ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ జమిలి ఎన్నికల అవసరం గురించి నొక్కి చెప్పారు. 

“దేశంలో నిత్యం ఏదో ఓ రాష్ట్రంలో ఏవో ఓ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈవిధంగా ఎల్లప్పుడూ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటం వలన ప్రభుత్వంపై ఆర్ధికభారం పడుతుండటమే కాక, పరిపాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది.  

పంచాయతీ స్థాయి ఎన్నికల మొదలు రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలు, జాతీయస్థాయిలో లోక్‌సభ ఎన్నికలకు అన్నిటికీ ఒకే ఓటరు కార్డు, జాబితాలను వినియోగించే అవకాశం ఉంది. కానీ ప్రతీ ఎన్నికలకు మనం వేర్వేరు కార్డులు, జాబితాలను ఎందుకు ఉపయోగిస్తున్నాము? ఆ అవసరం ఏమిటి? అని అందరూ ఆలోచించాలి. ఒకే కార్డు, ఒకే జాబితా విధానాన్ని అమలుచేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అమలుచేసేందుకు ప్రయత్నించాలి.

వన్ నేషన్... వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) విధానం అమలులోకి తేగలిగితే భారీగా ఖర్చు తగ్గిపోతుంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై, ఎన్నికల అధికారులపై పని ఒత్తిడి తగ్గుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది.               

కనుక జమిలి ఎన్నికలు కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఈ విధానం గురించి మీరందరూ లోతుగా అధ్యయనం చేసి దానిలో కష్టానష్టాలు, సాధ్యాసాధ్యాలను కేంద్రప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతున్నాను,” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.


Related Post