టిఆర్ఎస్‌-బిజెపిలు గల్లీలో కుస్తీ...ఢిల్లీలో దోస్తీ: కాంగ్రెస్‌

November 25, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కురుక్షేత్రంలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరుగుతున్న పోరులో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనకబడిపోయింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించే అలవాటు కారణంగా దుబ్బాక ఉపఎన్నికలలో ఘోరపరాజయం పాలైనప్పటికీ మళ్ళీ ఈ ఎన్నికలలో కూడా ఆ రెండు పార్టీలను ఒంటరిగా ఢీకొనేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. నిన్ననే కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే హైదరాబాద్‌లో ఒక్కో వరద బాధిత కుటుంబానికి రూ.50,000 చొప్పున ఆర్ధికసాయం అందిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.   

ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ మానిక్కం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌-బిజెపిల మద్య ఉన్న అనుబందం అందరికీ తెలిసిందే. అవసరమైనప్పుడు సహకరించుకొంటూ మిగిలిన సమయాలలో శత్రువుల్లా కత్తులు దూసుకొంటుంటాయి. ఇప్పుడూ అదే చేస్తున్నాయి. టిఆర్ఎస్‌ అవినీతికి మారుపేరైతే బిజెపి మతరాజకీయాలకు మారుపేరు. సాగునీటి ప్రాజెక్టులలో సంపాదించిన అవినీతిసొమ్మును టిఆర్ఎస్‌ ఈ ఎన్నికలలో ఖర్చు చేస్తుంటే, బిజెపి నేతలు తమకు అలవాటైన మతరాజకీయాలతో ప్రజల మద్య చిచ్చుపెడుతున్నారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి నేతలు, ప్రచారానికొచ్చే కేంద్రమంత్రులు ఆరోపిస్తుంటారు. కానీ తమ చేతిలోనే ఉన్న ఐ‌టి, ఈడీ, సిబిఐలను పంపించి దాని అవినీతిని వెలికితీయరు. టిఆర్ఎస్‌-బిజెపిలది గల్లీలో కుస్తీ... ఢిల్లీలో దోస్తీ. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజలందరినీ సమానంగా చూస్తూ వారి సమస్యలను తీర్చగలదు. హైదరాబాద్‌ నగరంలో పేరుకుపోయిన సమస్యలన్నిటినీ పరిష్కరించబడాలంటే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తప్పక గెలిపించాలి,” అని అన్నారు. 


Related Post