దేశమంతటా ప్రశాంత వాతావరణం ఉంది: కిషన్ రెడ్డి

November 24, 2020


img

తెలంగాణలో టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో మతఘర్షణలు, ఉగ్రదాడులు నిలిచిపోయి ప్రశాంత వాతావరణం నెలకొందని మంత్రి కేటీఆర్‌, సిఎం కేసీఆర్‌ చెపుతుండటంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అనూహ్యంగా స్పందించారు. 

సిఎం కేసీఆర్‌ నిన్న విడుదల చేసిన టిఆర్ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోపై కిషన్ రెడ్డి స్పందిస్తూ, “ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే కాదు...ప్రధాని నరేంద్రమోడీ పాలనలో యావత్ దేశంలోను ప్రశాంత వాతావరణం నెలకొంది. దేశంలో 80 శాతం నగరాలు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఉన్నాయి. వాటిలో ఎక్కడా మత ఘర్షణలు జరుగలేదు...ఉగ్రదాడులు జరుగలేదు..కర్ఫ్యూలూ విధించలేదు. కానీ సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తమవల్లే హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం నెలకొందని గొప్పలు చెప్పుకొంటున్నారు. 

పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకొంటే కోట్లమంది హిందువుల అంతుచూస్తామని హెచ్చరించిన ఓవైసీలతోనే సిఎం కేసీఆర్‌ కలిసి తిరుగుతుండటాన్ని ఏమనుకోవాలి? ఓ పక్క మతతత్వపార్టీతో కలిసి తిరుగుతూ బిజెపి మతరాజకీయాలు చేస్తోందని, హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొడుతోందని సిఎం కేసీఆర్‌, కేటీఆర్‌ దుష్ప్రచారం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

పాతబస్తీకి మెట్రో రైల్‌ రాకుండా చేసింది ఓవైసీలు, కేసీఆరే కదా?కానీ ఇప్పుడు పాతబస్తీ గురించి మొసలికన్నీళ్ళు కార్చుతున్నారు. దశాబ్ధాలుగా పాతబస్తీలో ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో అక్కడి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. కనుక టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలకు పాతబస్తీ ప్రజలను ఓట్లు అడిగే హక్కే లేదు. 

సిఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో 2016లో ప్రకటించిన పాత మ్యానిఫెస్టోకు జిరాక్స్ కాపీ మాత్రమే. పాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే మళ్ళీ ఇప్పుడూ ఇస్తున్నారు. అంటే నేటికీ ఆనాడు ఇచ్చిన పాత హామీలను నెరవేర్చలేదనే కదా? లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టిస్తే తప్ప ప్రజలను ఓట్లు ఆగగనని శాసనసభలో చెప్పుకొన్న ముఖ్యమంత్రి 2018 శాసనసభ ఎన్నికలలో, 2019 లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓట్లు అడుగుతున్నారు. 

ఇచ్చిన హామీలను అమలుచేయకుండా, దేశానికి దిశదశ చూపిస్తానంటున్నారు. కానీ రాష్ట్రంలో ఏ దిశకు వెళ్ళినా కల్వకుంట్ల కుటుంబమే కనిపిస్తుంది తప్ప అభివృద్ధి కనబడదు. దేశంలో ప్రతిపక్షాలన్నిటినీ కూడగట్టి 100 సమావేశాలు నిర్వహించుకొన్నా మాకేమీ అభ్యంతరం లేదు. ఎన్నికల సమయంలో ఇటువంటి మాటలతో ప్రజలలో సెంటిమెంట్ రాజేయడం సిఎం కేసీఆర్‌కు అలవాటే. కేసీఆర్‌ తాటాకు చప్పుళ్ళకు బిజెపి భయపడబోదు. నగరంలో మెట్రో, ఔటర్‌రింగ్‌ రోడ్డు, గోదావరి జలాలు వగైరాలకు గతంలోనే పనులు ప్రారంభం అయ్యాయి. వాటినే టిఆర్ఎస్‌ తనవిగా చెప్పుకొంటోంది,” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. 


Related Post