కేసీఆర్‌ వంటి ముఖ్యమంత్రిని చూడలేదు: పోసాని

November 21, 2020


img

ప్రముఖ తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి, తెలుగు సినీ దర్శకుడు ఎన్‌. శంకర్ కలిసి శనివారం ఉదయం సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, “నా జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ కేసీఆర్‌ వంటి గొప్ప పట్టుదల, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉన్న గొప్ప ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు. తెలంగాణలో అన్ని వర్గాలవారిని ఆయన సమానంగా ఆదరిస్తున్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. నగరంలో ఎటువంటి గొడవలు లేకపోవడంతో అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.

గతంలో సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ సమస్యలుండేవి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అటువంటి సమస్యలే లేకుండా చేశారు. కేవలం ఆరున్నరేళ్ళలో ఇంత అభివృద్ధి సాధించడం మామూలు విషయమేమీ కాదు. దేశంలో మరే రాష్ట్రంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడినందున అభివృద్ధి పనులు కొంత మెల్లగా సాగినప్పటికీ ఏవీ ఆగిపోలేదు. 

గత 100 ఏళ్ళలో ఎన్నడూ చూడని స్థాయిలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడ్డాయి. ఆ స్థాయిలో వర్షం కురిస్తే వందమంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరు కానీ కేసీఆర్‌ ఒక్కరే యధాశక్తిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు గట్టిగా ప్రయత్నించారు. వరదబాధితులను ఆదుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యలన్నీ రాత్రికి రాత్రి పరిష్కారం చేయలేము కొంత సమయం పడుతుంది. కేసీఆర్‌ కూడా అన్ని సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించుకొని వస్తున్నారు. ఈ ఆరేళ్ళలో హైదరాబాద్‌ నగరంలో కళ్ళకు కనబడేంతగా అభివృద్ధి జరిగింది. ఇక ముందు కూడా ఇలాగే నగరం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే టిఆర్ఎస్‌కే ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకోవాలి,” అని అన్నారు.


Related Post