జనసేన కీలక నిర్ణయం

November 21, 2020


img

మూడు రోజుల క్రితమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దపడిన జనసేన పార్టీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే.లక్ష్మణ్ తదితరులు శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన సమక్షంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. 

ఆ తరువాత పవన్‌ కల్యాణ్‌కు మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే రాష్ట్ర బిజెపి నేతలను కలిసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల గురించి చర్చించాలనుకొన్నాను. కానీ ఈలోగానే హటాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో మా పార్టీ కార్యకర్తల అభిమతం మేరకు ఈ ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నాము. కానీ బిజెపి మా మద్దతు కోరినందున ఈ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొని ఆ పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాము. కనుక నామినేషన్లు వేసిన జనసేన అభ్యర్ధులు తమ నామినేషన్లను వెనక్కు తీసుకోవాలని కోరుతున్నాను. హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే అది బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ సహాయసహకారాలతోనే సాధ్యం. కనుక జనసేన కార్యకర్తలు, నా అభిమానులు అందరూ కూడా బిజెపికి పూర్తి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మా పార్టీకి మద్దతు ఇస్తునందుకు  కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాము. ఈ ఎన్నికలలో బిజెపి తరపున పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. సెంటిమెంటుతో టిఆర్ఎస్‌, మతం పేరుతో మజ్లీస్‌ రాజకీయాలు చేస్తున్నాయే తప్ప లాక్‌డౌన్‌, వరదల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదు. వరదసాయం పంపిణీలో కూడా టిఆర్ఎస్‌ అవకతవకలకు పాల్పడింది. కనుక బిజెపి మాత్రమే హైదరాబాద్‌ ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయగలదు. ఈ ఎన్నికలలో బిజెపి తప్పకుండా విజయం సాధిస్తుందని భావిస్తున్నాము,” అని అన్నారు.  


Related Post