నేను బిజెపిలో చేరడం లేదు: కొండా

November 21, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో విజయం సాధించడంతో చాలా ఉత్సాహంగా ఉన్న బిజెపి నేతలు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలను వరుసగా కలుస్తూ పార్టీలోకి రప్పించేందుకు ముమ్మురా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ శుక్రవారం మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణను కలిసి బిజెపిలోకి ఆహ్వానించగా ఇటువంటి అవకాశం కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆయన వెంటనే అంగీకరించడమే కాక తాను బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో బిజెపి నేతలు మాజీ కాంగ్రెస్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా కలిసారని, ఆయన కూడా బిజెపిలో చేరేందుకు సానుకూలంగా స్పందించారని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటనే వాటిని ఖండించారు. 

"నేను బిజెపిలో చేరబోతున్నానని ఇప్పుడే పుకార్లు విన్నాను. అవి పుకార్లు మాత్రమే. నాకు టిఆర్ఎస్‌, మజ్లీస్‌, బిజెపిలతో సహా అన్ని పార్టీలలో మిత్రులున్నారు," అని ట్వీట్ చేశారు.


దుబ్బాక ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతిని కూడా కలిశారు. ఆమె కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. వాటిని కాంగ్రెస్ ఖండించింది కానీ ఆమె ఖండించలేదు. కనుక ఆమె కూడా త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉంది. 


Related Post