అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: మంత్రి కేటీఆర్‌

November 20, 2020


img

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ శుక్రవారం తెలంగాణ భవన్‌లో అభివృద్ధి నివేదికను విడుదల చేశారు. దానిలో తెలంగాణ ప్రభుత్వం గత ఆరేళ్ళలో హైదరాబాద్‌ నగరంలో చేసిన అభివృద్ధిపనులకు సంబందించి పూర్తి వివరాలున్నాయి. వాటిని ప్రజాలోకి తీసుకువెళ్ళి మళ్ళీ మరోసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో విజయం సాధించాలని పార్టీ నేతలను, అభ్యర్ధులను కోరారు. తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్‌లో త్రాగునీరు, విద్యుత్ సమస్యలను శాస్వితంగా పరిష్కరించిందని అన్నారు. గత ఆరేళ్లుగా హైదరాబాద్‌ నగరంలో చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొందని, దాంతో అనేక భారీ పెట్టుబడులు, సంస్థలు తరలివచ్చాయని కేటీఆర్‌ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరం ఆర్ధిక ఇంజిన్‌గా మారిందన్నారు. హైదరాబాద్‌ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నందునే ఇదంతా సాధ్యమైందన్నారు. కనుక అందరం కలిసి హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసుకొనేందుకు కలిసికట్టుగా పనిచేసి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలవాలని కేటీఆర్‌ అన్నారు.

జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్‌లలో 85 డివిజన్‌లలో మహిళలకే సీట్లు కేటాయించిన ఘనత టిఆర్ఎస్‌దని అన్నారు. ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడినవారినీ టిఆర్ఎస్‌ సమానంగా ఆదరిస్తూ వారికి ఈ ఎన్నికలలో 8 సీట్లు కేటాయించిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. అన్ని కోణాలలో నుంచి పరిశీలించిన తరువాతే అభ్యర్ధులను ఖరారు చేశామని అయినా కొంతమందికి టికెట్ ఇవ్వలేకపోయామని వారికి తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. టికెట్ పొందినవారు లభించనివారి ఇళ్లకు వెళ్ళి వారిని అనునయించి కలుపుకుపోవాలని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు. ఈ ఎన్నికలలో 100కు పైగా స్థానాలు గెలుచుకోగలమని మంత్రి కేటీఆర్‌ నమ్మకం వ్యక్తం చేశారు. అదే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేసారు. 


Related Post