సిఎం పదవికి రాజీనామా చేస్తా: కేసీఆర్‌

October 31, 2020


img

దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపధకాలకు కేంద్రప్రభుత్వమే నిధులు ఇస్తోందంటూ చేస్తున్న ప్రచారంపై సిఎం కేసీఆర్‌ కూడా ఘాటుగా స్పందించారు. ఇవాళ్ళ జనగామ జిల్లాలోని కొడకండ్ల గ్రామంలో రైతువేదికను ప్రారంభించిన తరువాత అక్కడ రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి నేతలు ఎంతగా అబద్దాలాడినా గెలవలేరు. టిఆర్ఎస్‌ చేతిలో మళ్ళీ మరోసారి వారికీ, కాంగ్రెస్‌ నేతలకు పరాభవం తప్పదు. రాష్ట్రంలో అన్నిరకాల పింఛన్లు కలిపి మొత్తం 38,64,751 మందికి అందజేస్తున్నాము. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 10-11,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా టంచనుగా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్లుగా నెలనెలా పింఛన్లు వారి ఖాతాలలో జమా చేస్తున్నాము. అయితే వాటన్నిటికీ కేంద్రప్రభుత్వమే నిధులు ఇస్తోందంటూ బిజెపి నేతలు దుబ్బాకలో ప్రచారం చేసుకొంటున్నారు. 

కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 7 లక్షల మందికి నెలకు రూ.200 చొప్పున పింఛన్ ఇస్తోంది. దాని కోసం ఏడాదికి రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోంది. ఇంతకు మించి కేంద్రం ఇస్తున్నట్లు ఏ మగాడైనా నిరూపిస్తే నేను వెంటనే నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసివెళ్లిపోతాను. ఈ లెక్కలన్నీ కాగ్ వద్ద ఉన్నాయి. కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు. కానీ బిజెపి నేతలు దుబ్బాక ఉపఎన్నికలలో గెలిచేందుకు ఎన్ని అబద్దాలైన ఆడేందుకు వెనుకాడటం లేదు. వారికి ప్రజల ఓట్లు తప్ప ప్రజలు అక్కరలేదు. అందుకే కేంద్రప్రభుత్వం రైతులకు తీరని నష్టం కలిగించే వ్యవసాయబిల్లులను తీసుకువచ్చింది. పార్లమెంటులో వాటిని ప్రతిపక్షాలు అడ్డుకొంటే కేంద్రప్రభుత్వం గూండాగిరీ ప్రదర్శించి ఆమోదింపజేసుకొంది. మనకు నష్టం జరుగుతుంటే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోకూడదు. కేంద్రాన్ని గట్టిగా నిలదీయాల్సి ఉంది,” అని అన్నారు.


Related Post