దుబ్బాకతోనే రాష్ట్రంలో రాజకీయమార్పు షురూ: కిషన్ రెడ్డి

October 30, 2020


img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఇవాళ్ళ మిరదొడ్డి మండలం భూపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణలో రాజకీయమార్పుకు దుబ్బాక ఉపఎన్నికలే నాందికాబోతున్నాయి. కేసీఆర్‌ కుటుంబపాలనతో విసుగెత్తిపోయున్న ప్రజలు ఈ ఎన్నికలలో బిజెపిని గెలిపించి మార్పు కోరుకొంటున్నామని తెలియజేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని తానొక్కడే సాధించినట్లు కేసీఆర్‌ చెప్పుకొంటారు. కానీ ఆనాడు పార్లమెంటులో బిజెపి పూనుకోకపోతే వేయిమంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేదేకాదు. తెలంగాణ ఏర్పడిన తరువాత దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి తప్పారు. కేసీఆర్‌ పాలన మొదలైనప్పటి నుంచి తెలంగాణలో నిరుద్యోగసమస్య పెరిగిపోయింది. కనీసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆయుష్మాన్ భారతి, కిసాన్ సమ్మాన్ వంటి పధకాలను సైతం రాష్ట్రంలో అమలుచేయకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రానికి నిధులు ఇస్తున్నప్పటికీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేయడం టిఆర్ఎస్‌ నేతలకు దూరలవాటుగా మారిపోయింది. రాష్ట్రంలో నడుస్తున్న కుటుంబపాలన, నిరంకుశపాలనను వ్యతిరేకిస్తున్నామని తెలియజేప్పేందుకు ఈ ఉపఎన్నికలే మంచి అవకాశం కనుక దుబ్బాక ప్రజలందరూ బిజెపికే ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను.

ఈ ఉపఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ అభ్యర్ధులను మా అభ్యర్ధి రఘునందన్ రావుతో బేరీజు వేసుకొని ఓట్లు వేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. రఘునందన్ రావు వంటి విద్యావంతుడు, రాష్ట్ర సమస్యలు, పరిస్థితి గురించి అవగాహన ఉన్న వ్యక్తిని అసెంబ్లీకి పంపించినట్లయితే ఆయన ప్రజల తరపున ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిఎం కేసీఆర్‌ కనుసన్నలలో నడుస్తోంది. కనుక కాంగ్రెస్‌కు వేసినా ఒక్కటే టిఆర్ఎస్‌కు వేసినా ఒక్కటే. ఈ ఉపఎన్నికలలో బిజెపిని గెలిపించినట్లయితే అదే రాష్ట్ర భవిష్యత్‌కు శ్రీకారమవుతుందని తెలియజేస్తున్నాను” అని అన్నారు. 


Related Post