విద్యుత్ వాహన పాలసీ ప్రకటించిన మంత్రి కేటీఆర్‌

October 30, 2020


img

రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో తెలంగాణ ఎలెక్ట్రిక్ వెహికిల్స్ (టీఈవి)ని ప్రకటించారు. ఇది 2020-2030 వరకు అమలులో ఉంటుంది. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్ ఐపాస్, బీఎస్ ఐపాస్ విధానాలు విజయవంతమయ్యాయి. టిఎస్ ఐపాస్ ద్వారా గత 5 ఏళ్ళలో రాష్ట్రానికి 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. భావితరాలకు కాలుష్యరహితమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కనుక రాష్ట్రంలో పర్యావరణ అనుకూలమైన ఎలెక్ట్రిక్ వాహనాలు, వాటి బ్యాటరీలు, విడిభాగాల ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు, రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు దోహదపడే ఈ టీఈవీ పాలసీని ప్రవేశపెడుతున్నాము. మహేశ్వరంలో వేలఎకరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 1,000 ఎకరాలలో ఆటోమోబైల్ ఇండస్ట్రీకి, ఎలెక్ట్రిక్ వాహనాలు, విడిభాగాలు, బ్యాటరీలను తయారు చేసే కంపెనీలకు కేటాయిస్తాము. ఈ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలెక్ట్రిక్ వాహనాల హబ్‌గా ఎదిగేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు. 

ఈ కార్యక్రమంలోనే ఐదు కంపెనీలు మహేశ్వరంలో పరిశ్రమలు స్థాపించేందుకు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొన్నాయి. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, రవాణాశాఖల ముఖ్యకార్యదర్శులు జయేష్ రంజన్, సునీల్ శర్మ, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, సినీనటుడు విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.


Related Post