సంజయ్‌ దుబ్బాక వస్తారా..నన్ను కరీంనగర్‌ రమ్మంటారా?

October 28, 2020


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు మళ్ళీ మరోసారి సవాలు విసిరారు. ఈరోజు ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “దుబ్బాకలో బిజెపి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకొంటోంది. మొదట రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలకు కేంద్రం నిధులిస్తోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ వాదించారు. నిరూపించమని నేను సవాలు విసిరితే ఆయన స్పందించలేదు. అబద్దాలతో ప్రజలను తప్పు దోవ పట్టించాలనే ప్రయత్నంలో బిజెపి చేసుకొన్న మొదటి సెల్ఫ్ గోల్ అది. ఆ తరువాత మొన్న పోలీసుల సోదాలలో డబ్బు పట్టుబడితే, పోలీసులే తెచ్చి పెట్టారంటూ బిజెపి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేసుకొన్నారు. ఆ ప్రచారంతో బిజెపి తాత్కాలికంగా ఒకరోజు పై చేయి సాధించగలిగింది కానీ అది ఆ ఒక్కరోజుకే పరిమితం అయ్యింది. ఆ డబ్బును దుబ్బాకలో పంచిపెట్టడానికి బిజెపి అభ్యర్ధి (రఘునందన్ రావు) తమ ఇంట్లో పెట్టారని ఆయన అత్తగారు, మామగారే స్వయంగా చెప్పారు. ఆ వీడియోను పోలీస్ కమీషనర్ విడుదల చేయడంతో బిజెపి నేతలు అబద్దాలు, దుష్ప్రచారం, దీక్షలతో ప్రజలను మభ్యపెట్టి సానుభూతి ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నారనే విషయం బయటపడింది. ఇది మరో సెల్ఫ్ గోల్ అని చెప్పవచ్చు. 

ఈవిధంగా అబద్దాలు చెపుతూ, దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం అవివేకం. వారు చెప్పేవి అబద్దాలని ప్రజలకు తెలియదనుకోవడం ఇంకా అవివేకం. ఒకవేళ బిజెపి నిజంగా రాష్ట్రానికి ఏమైనా చేసిందని భావిస్తే అదే విషయం చెప్పుకొని ప్రజలను ఓట్లు అడిగిఉంటే హుందాగా ఉండేది. కానీ అబద్దాలు చెపుతూ ప్రజలకు డబ్బు, మద్యం పంచిపెట్టి గెలవాలనుకొంటే, పోలీసులు, ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకోదని గ్రహిస్తే మంచిది. 

సంక్షేమ పధకాలకు కేంద్రం నిధులిస్తోందని వాదించిన బండి సంజయ్‌తో ఆ అంశంపై బహిరంగ చర్చకు నేను ఇప్పటికీ సిద్దంగానే ఉన్నాను. ఆయన దుబ్బాక వస్తారా... లేదా నన్నే కరీంనగర్‌ రమ్మంటారా చెప్పాలి. ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే అక్కడకు రావడానికి నేను సిద్దంగా ఉన్నాను. ఒకవేళ కేంద్రప్రభుత్వం సంక్షేమ పధకాలకు కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తున్నట్లు ఆయన నిరూపిస్తే నేను నా మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సిద్దం లేకపోతే ఆయన రాజీనామా చేయాలి,” అని సవాలు విసిరారు.


Related Post