తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు డీఏ పెంపు

October 24, 2020


img

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు దసరా పండుగ సందర్భంగా ఓ శుభవార్త! సిఎం కేసీఆర్‌ సూచనల మేరకు వారి డీఏను 5.24 శాతంకు పెంచుతూ తెలంగాణ ఆర్ధికశాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ 2019 జూలై 1 నుంచి వర్తిస్తుంది. ఆ మొత్తాన్ని ఉద్యోగుల భవిష్యనిధిలో ప్రభుత్వం జమా చేస్తుంది. దీంతో ప్రస్తుతం 33.53 శాతం ఉన్న డీఏ 38.77 శాతం అయ్యింది. డీఏ పెంపుపై ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఏలకు, పార్ట్ టైమ్ అసిస్టెంట్లకు కూడా ప్రభుత్వం నెలకు రూ.100 చొప్పున గౌరవవేతనం పెంచింది. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న ఉద్యోగసంఘాల నేతలను వెంటబెట్టుకొని ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ను కలిసి డీఏ పెంచినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారి అభ్యర్ధన మేరకు ఇక నుంచి దసరా పండుగ మరుసటిరోజున కూడా శలవు దినంగా ప్రకటించేందుకు సిఎం కేసీఆర్‌ అంగీకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

కేంద్రప్రభుత్వమే ఉద్యోగుల డీఏ పెంపుపై నిర్ణయం తీసుకొని ప్రకటిస్తుంటుందని, అందువల్లే ఆలస్యం అవుతోందని ఈ విధానం మారవలసిన అవసరం ఉందని సిఎం కేసీఆర్‌ అన్నారు. కనుక కేంద్రప్రభుత్వం నిర్ణయం, ప్రకటన కోసం ఎదురుచూడకుండా ఇక నుంచి ప్రతీ ఆరునెలలకు డీఏ పెంపు గడువు సమీపించగానే అంచనాలను రూపొందించి డీఏ ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఆ తరువాత కేంద్రప్రభుత్వం ప్రకటించిన డీఏకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకోవచ్చునని సిఎం కేసీఆర్‌ సూచించారు. సిఎం కేసీఆర్‌ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సిఎం కేసీఆర్‌ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకొన్నారు. అన్నిటినీ తప్పకుండా పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడంతో వారు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.


Related Post