కాంగ్రెస్‌, బిజెపిలకు ఎందుకు ఓట్లేయాలి? హరీష్‌రావు

October 23, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాత తరపున ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి హరీష్‌రావు, ప్రధానంగా బిజెపిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం గమనిస్తే బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు నుంచే గట్టి పోటీ ఉంటుందని టిఆర్ఎస్‌ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. మంత్రి హరీష్‌రావు శుక్రవారం దుబ్బాక మండలంలోని రాజక్కపేటలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్‌కు ఓట్లేస్తే కాలిపోయే మోటర్లు... బిజెపికి వేస్తే బాయికాడ మోటర్లు...అదే టిఆర్ఎస్‌ ప్రభుత్వమైతే రైతులకు కరెంట్ కోతల నుంచి విముక్తి కల్పించి 24 గంటలు ఉచిత విద్యుత్ కూడా అందిస్తోంది. మళ్ళీ పంటసాగుకు రైతు బంధు అందిస్తోంది. ఏ కారణం చేతైనా రైతు చనిపోతే రైతుభీమా పధకం ద్వారా వెంటనే రూ.5 లక్షలు ఇప్పించి రైతు కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకొంటోంది. రైతులకు అండగా నిలబడే టిఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌కు ఓట్లేస్తే మోరీలో వేసినట్లే. బిజెపి అంటే భారతీయ జూటా పార్టీ. రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయిన ఎంతో ఇచ్చినట్లు అబద్దాలు చెప్పుకొంటూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనుకొంటోంది. పింఛనుల గురించి బహిరంగచర్చకు రమ్మని సవాలు విసిరితే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పత్తాలేకుండా పారిపోయాడు. టిఆర్ఎస్‌ను కాదని ఇటువంటి పార్టీలకు మనం ఎందుకు ఓటేయాలో ప్రజలు ఆలోచించాలి. మన అభ్యర్ధి సోలిపేట సుజాతను గెలిపించుకొంటే దుబ్బాకను మరింత అభివృద్ధి చేసుకొందాము,” అని అన్నారు. 

దుబ్బాక ఉపఎన్నికలలో సోలిపేట సుజాత (టిఆర్ఎస్‌), చెరుకు శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్‌) రఘునందన్ రావు (బిజెపి)ల మద్యే ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. 

దుబ్బాక ఉపఎన్నికలు నవంబర్‌ 3న జరుగుతాయి. నవంబర్‌ 10న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. 


Related Post