ధరణిలో ఆస్తుల వివరాల నమోదు ఎప్పుడైనా చేసుకోవచ్చు

October 23, 2020


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు కార్యక్రమం రాష్ట్రంలో చురుకుగా సాగుతోంది. అయితే దసరానాటికి ధరణీని ప్రారంభించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తుండటంతో ప్రజల ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు తగినంత సమయం లేక వాలంటీర్లు నామమాత్రంగా చేసుకుపోతున్నారనే పిర్యాదులు వినిపిస్తున్నాయి. 

ధరణి పోర్టల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధరమాసనం దానిపై బుదవారం విచారణ జరిపింది. ఈకేసులో ప్రభుత్వం తరపున హాజరైన ఏజీ బిఎస్ ప్రసాద్, “ధరణి పోర్టల్‌లో ప్రజల ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఎటువంటి గడువు విధించలేదు. ఇది నిరంతరంగాసాగే ప్రక్రియ కనుక ప్రజలు ఎప్పుడైనా తమ ఆస్తుల వివరాలను ధరణీలో నమోదు చేసుకోవచ్చు,” అని తెలిపారు. 

ధరణీలో ఆస్తుల వివరాలతో పాటు యాజమానుల కులం గురించి కూడా ప్రశ్నిస్తున్నారని పిటిషనర్ అభ్యంతరాన్ని హైకోర్టు ధర్మాసనం త్రోసిపుచ్చింది. ‘మనదేశంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు ప్రతీచోట కులం వివరాలు అవసరం పడుతూనే ఉన్నాయని కనుక ధరణీలో నమోదు చేస్తే తప్పేమిటని’ న్యాయమూర్తులు ప్రశ్నించారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను నవంబర్‌ 3కు వాయిదా వేశారు.


Related Post