బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోలో కరోనా వాక్సిన్!

October 23, 2020


img

కరోనా సమస్య జాతీయ విపత్తు అని, కనుక దానిపై రాజకీయాలు చేయవద్దని చెప్పింది కేంద్రప్రభుత్వమే. కానీ ఇప్పుడు బిజెపి నేతృత్వంలో నడుస్తున్న కేంద్రప్రభుత్వమే కరోనాను రాజకీయప్రయోజనాల కోసం వినియోగించుకొనేందుకు సిద్దమైంది. 

త్వరలో జరుగబోయే బిహార్‌ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఆర్ధికమంత్రి గురువారం ఢిల్లీలో బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. దానిలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని కూడా చేర్చారు. రాష్ట్రంలో తమ ఎన్డీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే ఐసీఎంఆర్‌ ఆమోదం లభించగానే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇప్పిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.

బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని వాడుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. యావత్ దేశప్రజలు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తుంటే, బిహార్‌ ప్రజలకు ఉచితంగా అందజేస్తామని హామీ ఇవ్వడం ఏమిటని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. కేంద్రప్రభుత్వం ఒక్క బిహార్‌ రాష్ట్రానికే పరిమితమైందా? దేశంలో అన్ని రాష్ట్రాల బాధ్యత కేంద్రానికి లేదా? అని ప్రశ్నిస్తున్నారు. కరోనాను రాజకీయాలతో ముడిపెట్టొద్దని పదేపదే చెప్పిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఏమి చేసిందని ప్రశ్నిస్తున్నారు. బిహార్‌ ఎన్నికల కోసం ఎన్డీయే ప్రభుత్వం ఇంతగా దిగజారిపోయిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

యావత్ దేశ ప్రజలతో పాటు బిహార్‌ ప్రజలకు కూడా ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పి ఉండి ఉంటే ఎవరూ ఈవిధంగా వేలెత్తి చూపి ఉండేవారు కారు. మిగిలిన రాష్ట్రాలలో ప్రజలకు నామమాత్రపు ధరలకు వ్యాక్సిన్‌ ఇస్తామని చెపుతున్న కేంద్రప్రభుత్వం బిహార్‌  ప్రజలకు ఉచితంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వడం ఓటర్లను ప్రలోభపెట్టడమే అవుతుంది కనుక బిజెపిపై కేంద్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.


Related Post