గత ప్రభుత్వాల తప్పిదాల వలనే నేడు... మంత్రి తలసాని

October 20, 2020


img

హైదరాబాద్‌ వరదలకు గత పాలకుల తప్పిదాలే కారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ తదితరులు హైదరాబాద్‌లో వరద పరిస్థితి, ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల గురించి మాట్లాడి, ప్రతిపక్షాల తీరును తప్పు పట్టారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో ఎక్కడా అక్రమనిర్మాణాలు జరుగలేదు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల కారణంగానే నేడు హైదరాబాద్‌కు ఈ దుస్థితి ఎదురైంది. హైదరాబాద్‌లో ఏవో కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగితే మొత్తం హైదరాబాద్‌ అంతా మునిగిపోయిందన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతుండటం చాలా దారుణం. అయినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా దేవుడిలా ఆదుకొనేందుకు సిఎం కేసీఆర్‌ ఉన్నారు. వరదాబాధితులను ఆదుకోవడానికి రూ.550 కోట్లు విడుదల చేశారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. 

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు కాంగ్రెస్‌, బిజెపినేతలకు లేదు. ఎందుకంటే వారు వరదాబాడితులకు చేసిందేమీ లేదు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప. కాంగ్రెస్‌, బిజెపి నేతలు కేవలం తమ స్వీయప్రచారం కోసమే నగరంలో పర్యటించారు తప్ప వారికి వరదబాధితులను ఆదుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేదు. టిఆర్ఎస్‌ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ గత వారం పదిరోజులుగా నగరంలో తిరుగుతూ ప్రజలకు అండగా నిలబడుతున్నారు,” అని అన్నారు. 


Related Post