డల్లాస్ కాదు వెనీస్ నగరం: భట్టి విక్రమార్క

October 17, 2020


img

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇవాళ్ళ మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ను రాష్ట్రంలో నగరాలు పట్టణాలను డల్లాస్, ఇస్తాంబుల్‌లాగా మార్చేస్తానని గొప్పలు చెప్పారు. కానీ నీట మునిగిన హైదరాబాద్‌ నగరం వెనీస్ నగరాన్ని తలపిస్తోంది. మంత్రి కేటీఆర్‌ చెప్పిన విశ్వనగరం ఇదేనా?హైదరాబాద్‌ అభివృద్ధికి 72,000 కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి కేటీఆర్‌ పదేపదే చెప్పారు. అన్ని వేలకోట్లు ఖర్చు చేస్తే మరి హైదరాబాద్‌ పరిస్థితి ఇప్పుడు ఇంత దయనీయంగా ఎందుకు ఉందిప్పుడు?ఆ వేలకోట్లు ఎక్కడ ఖర్చు చేశారు?” అని ప్రశ్నించారు. 

శుక్రవారం సాయంత్రం కల్వకుర్తి ఎత్తిపోతల పధకంలో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ తీసుకొన్న తప్పుడు నిర్ణయాల వలన కల్వకుర్తి ఎత్తిపోతల పధకంలో ప్రమాదం జరిగితే గత ప్రభుత్వమే కారణమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పడానికి సిగ్గుండాలి. భూగర్భ పంప్‌హౌస్‌ నిర్మిస్తే ఇటువంటి ప్రమాదం జరుగుతుందని ఆనాడు మేము చెప్పిన మాటను ఖాతరు చేయకపోయినా కనీసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ చెప్పిన సలహానైనా సిఎం కేసీఆర్‌ పట్టించుకొని ఉండి ఉంటే నేడు ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేదే కాదు. తమ కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు దానిని భూగర్భంలో నిర్మించి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు. అక్కడ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకొనే హక్కు ప్రతిపక్షాలుగా మాకుంది. కానీ అక్కడకు కాంగ్రెస్‌ నేతలెవరినీ వెళ్ళనీయకుండా పోలీసులను పెట్టి ప్రభుత్వం అడ్డుకొంటోంది. త్వరలోనే నేను, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అక్కడకు వెళ్ళి స్వయంగా పరిశీలిస్తాము. ఒకవేళ మమ్మల్ని వెళ్ళనీయకుండా అడ్డుకొంటే కోర్టు అనుమతి తీసుకొనైనా వెళ్ళి తీరుతాము,” అని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 


Related Post