అప్పుడే హెచ్చరించాం కానీ కేసీఆర్‌ వినలేదు: ఉత్తమ్

October 17, 2020


img

కల్వకుర్తి ఎత్తిపోతల పధకంలో నిన్న జరిగిన ప్రమాదంపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ సిఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కల్వకుర్తి ప్రాజెక్టుకి 400 మీటర్ల లోపు పాలమూరు-రంగారెడ్డి కోసం భూగర్బ పంప్‌హౌస్‌ను నిర్మిస్తే ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని మేము ఆనాడే శాసనసభలో సిఎం కేసీఆర్‌ను హెచ్చరించాము. దీనిపై ప్రభుత్వం వేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ 2016, జూన్‌కు 20న ఇచ్చిన నివేదికలో కూడా అదే చెప్పింది. అయినా సిఎం కేసీఆర్‌ తనకే అన్నీ తెలుసు అన్నట్లు ఎవరి సలహాలను, సూచనలను పట్టించుకోకుండా ఈ భూగర్బ పంప్‌హౌస్‌ను నిర్మింపజేశారు. దాంతో నీళ్ళు వచ్చినా రాకపోయినా మీ జేబులోకి కమీషన్లు నింపుకొన్నారు. అందుకే నీటిపారుదల శాఖ సిఎం కేసీఆర్‌ తన వద్దే ఉంచుకొన్నారు. కనుక ఈ నష్టానికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. అక్కడ ఏమి జరిగిందో తెలుసుకొనేందుకు వెళుతున్న మా కాంగ్రెస్‌ నేతలను పోలీసులతో అడ్డగించవలసిన అవసరం ఏమొచ్చింది? ప్రమాదం గురించి దాపరికం దేనికి?ఈ ప్రమాదంపై జ్యూడీషియల్ కమీషన్ వేసి విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలి,” అని అన్నారు. 



Related Post