కల్వకుర్తి పంప్‌హౌస్‌లో భారీ ప్రమాదం

October 17, 2020


img

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లూరు వద్ద గల మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లో శుక్రవారం సాయంత్రం సుమారు 4 గంటలకు భారీ ప్రమాదం జరిగింది. పంప్‌హౌస్‌ నిర్వహిస్తున్న పటేల్ కంపెనీ సిబ్బంది నిన్న సాయంత్రం 3వ పంప్‌మోటారును ఆన్‌ చేసి సర్జిపూల్ నుంచి నీటిని ఎగువకు పంపింగ్ చేయడం మొదలుపెట్టారు. పది నిమిషాల తరువాత హటాత్తుగా పంప్‌మోటారు పెద్ద శబ్ధంతో ఎగిరిపడింది. దానిని బిగించి ఉంచిన పెద్ద పెద్ద ఫౌండేషన్ బోల్టులు కూడా ఊడి వచ్చేశాయి. ఆ దెబ్బకు పంప్‌మోటారు తునాతునకలైపోయింది. సర్జిపూల్‌కు కలపబడిన పంప్‌మోటారు ఊడిపోవడంతో పంప్‌హౌస్‌లోకి నీళ్లు ప్రవేశించి క్షణాలలో 10 అంతస్తులు నీళ్ళతో నిండిపోయాయి. వెంటనే సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు అధికారులు వెంటనే పంప్‌హౌస్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అప్పటికే జరుగరాని నష్టం జరిగిపోయింది. పంప్‌హౌస్‌లో 45 మీటర్ల ఎత్తు నీరు చేరడంతో పంప్‌హౌస్‌లోని 5పంపుమోటర్లు నీట మునిగాయని సమాచారం. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందా లేదా అనేది ఇంకా తెలియవలసి ఉంది. 

కల్వకుర్తి ఎత్తిపోతల పధకం క్రింద కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి నియోజకవర్గాలలో సుమారు 2.50 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఈ ఏడాది అదనంగా మరో 70 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలనే ఉద్దేశ్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంలో భాగంగా భూగర్భంలో పంప్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు. అది కల్వకుర్తి (ఎత్తిపోతల పధకం) పంప్‌హౌస్‌కు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఉంది. భూగర్భంలో పంప్‌హౌస్‌ నిర్మించేందుకు బ్లాస్టింగ్స్ చేసినప్పుడు కల్వకుర్తి పంప్‌హౌస్‌కు నష్టం జరిగే అవకాశం ఉంటుందని గతంలోనే ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా బ్లాస్టింగ్స్ చేసి అక్కడ భూగర్భంలో పంప్‌హౌస్‌ నిర్మించడంతో నిపుణులు హెచ్చరించినట్లే కల్వకుర్తి పంప్‌హౌస్‌లోని పంప్‌మోటర్ల పునాదులలో పగుళ్ళు ఏర్పడి ఉండవచ్చు. అయితే పంప్‌మోటర్ల పునాదులు బలహీనపడ్డాయనే విషయం బయటకు తెలియదు కనుక అత్యధిక ప్రెషర్ (ఒత్తిడి)తో  నీటిని తోడుతున్నప్పుడు, ఆ ఒత్తిడిని తట్టుకోలేక పంప్‌మోటారును బిగించిన ఫౌండేషన్ బోల్టులు విరిగిపోవడంతో పంప్‌మోటారు ఊడిపడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.    

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకొన్న రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కలిసి నిన్న రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్ళి పరిస్థితిని స్వయంగా పరిశీలించి సిఎం కేసీఆర్‌కు తెలియజేశారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నీటిని పంపింగ్ చేస్తుండగా పంప్‌హౌస్‌లోకి నీళ్ళు చేరినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి సమస్యను పరిష్కరిస్తాము,” అని చెప్పారు. 


Related Post