రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరు మార్పు

September 23, 2020


img

రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరును యాదాద్రి రైల్వేస్టేషన్‌గా మార్చుతూ దక్షిణమద్య రైల్వే అధికారులు సెప్టెంబర్ 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. కనుక ఇకపై రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ రికార్డులలో రాయగిరికి బదులు యాదాద్రి రైల్వేస్టేషన్‌గా నమోదు చేయబడుతుంటుంది. 

కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చి సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేసి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. యాదాద్రిని అభివృద్ధి చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నానాటికీ భక్తుల సంఖ్య పెరుగుతోంది.

ప్రస్తుతం ఘట్‌కేసర్‌ వరకు మాత్రమే ఎంఎంటీఎస్‌ రైళ్ళు నడుస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి యాదాద్రి చేరుకొనేందుకు వీలుగా రాయగిరి వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లను పొడిగించి, రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరును యాదాద్రి రైల్వేస్టేషన్‌గా మార్చాలని సిఎం కేసీఆర్‌ 2016లో ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరును యాదాద్రి రైల్వేస్టేషన్‌గా మార్చి ఘట్‌కేసర్‌ నుంచి  యాదాద్రి రైల్వేస్టేషన్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైళ్ళను నడిపించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ సిగ్నల్ ఇచ్చింది. యాదాద్రికి సుమారు 3 కిమీ దూరంలో ఉన్న యాదాద్రి రైల్వేస్టేషన్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైళ్ళు అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు యాదాద్రికి మరింత సులువుగా, త్వరితంగా చేరుకోగలరు.


Related Post