హైదరాబాద్‌ నాలాలపై మూతలకు రూ.300 కోట్లు

September 22, 2020


img

ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని నాలాలన్నీ పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మూడు రోజుల వ్యవధిలో సుమేధా కపూరియా అనే 12 ఏళ్ళ బాలిక, నవీన్ కుమార్ అనే ఓ వ్యక్తి నాలా నీటిలో కొట్టుకుపోయి చనిపోవడంతో జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ఇటువంటి సంఘటనలు, పరిస్థితులు టిఆర్ఎస్‌కు నష్టం కలిగించే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ సమస్యపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. 

నగరంలో 2 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న నాలాలను కాంక్రీట్ పలకలతో మూసివేయాలని సమావేశంలో నిర్ణయించారు. వాటికోసం రూ.300 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఆర్ధికమంత్రి హరీష్‌రావుతో మాట్లాడి వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయిస్తానని మంత్రి కేటీఆర్‌ అధికారులకు హామీ ఇచ్చారు. ఆలోగా నగరంలో ఎక్కడెక్కడ నాలాలపై కాంక్రీట్ మూతలు ఏర్పాటు చేయాలో వివరాలు సేకరించి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. నాలాలలో మురుగునీరు సులువుగా ప్రవహించేందుకుగాను కాంక్రీట్ మూతలు వేయకమునుపే నాలాలలో పూడికలు తీయించి శుభ్రపరచాలని మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.  

ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నాలాలపై కాంక్రీట్ మూతలు ఏర్పాటు చేస్తుండటం సంతోషించదగ్గ విషయమే. కానీ నాలలోపడి చనిపోయిన సుమేధా కపూరియా, నవీన్‌కుమార్‌ కుటుంబాలను ప్రభుత్వం తరపున ఇంతవరకు ఎవరూ పరామర్శించకపోవడం, కనీసం సంతాపం తెలియజేయకపోవడం చాలా శోచనీయం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఓట్లు వేయమని కోరుతూ గల్లీగల్లీలో తిరుగుతూ అందరినీ కలిసే టిఆర్ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు ఇప్పుడు ఏమైపోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 


Related Post