కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ డబుల్ సవాళ్ళు మళ్ళీ షురూ

September 18, 2020


img

కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ నేతల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పరిశీలన కార్యక్రమం ఇవాళ్ళ అర్ధాంతరంగా ముగిసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ళు కట్టించామని గొప్పలు చెప్పుకొన్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం, ఇళ్ళు చూపించమంటే నగరం బయట కట్టిన ఇళ్ళను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చూపిస్తున్నారని ఆరోపిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు తదితర కాంగ్రెస్‌ నేతలు తమ పర్యాటనను అర్ధాంతరంగా ముగించారు. 

అనంతరం భట్టి విక్రమార్క గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ ప్రభుత్వం 5 నియోజకవర్గాలలో కలిపి మొత్తం 3,400 ఇళ్ళు మాత్రమే కట్టించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కట్టిన ఇళ్ళను చూపించమంటే నగరం బయట పక్క నియోజకవర్గాలలో కట్టిన ఇళ్ళను చూపిస్తామంటున్నారు. అంటే నగరంలో పేదలకు లక్ష ఇళ్ళు కట్టించామని టిఆర్ఎస్‌ ప్రభుత్వం చెపుతున్నావన్నీ మాయమాటలేనని అర్ధమవుతోంది. లక్ష ఇళ్ళు చూపించేవరకు మేము టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము,” అని అన్నారు. 

 కాంగ్రెస్‌ నేతల విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. “లక్ష ఇళ్ళు చూపించమని వారు మాకు సవాలు విసిరారు. మేము దానిని హుందాగా స్వీకరించి వారికి ఇళ్ళు చూపిస్తున్నాను. కానీ కట్టిన అన్ని ఇళ్ళూ చూడకుండానే మద్యలో పారిపోయి మళ్ళీ మా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో భూమి కొరత ఉంది కనుకనే నగర శివార్లలో ఇళ్ళు కట్టిస్తున్నాము. శివార్లలో కట్టినా నగరంలో ఉంటున్నవారికే వాటిని కేటాయిస్తాము. కాంగ్రెస్‌ నేతలకు ధైర్యం లేకనే ఏవో కుంటిసాకులు చెప్పి ఇళ్ళు చూడకుండా పారిపోయారు. వారు వచ్చి చూడకపోయినా మా ప్రభుత్వం కట్టిన, ఇంకా కట్టిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ వివరాలన్నీ పంపిస్తాం,” అని అన్నారు.


Related Post