కేంద్రమంత్రి పదవికి హర్‌సిమ్రత్ రాజీనామా

September 18, 2020


img

కేంద్ర ఆహారశుద్ది పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన రెండు వ్యవసాయ బిల్లులపై నిన్న పార్లమెంటులో సుదీర్గంగా చర్చ జరిగినప్పుడు, కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌, డీఎంకెలతో సహా పలు ప్రతిపక్ష పార్టీల సభ్యులు వాటిని తీవ్రంగా వ్యతిరేకించాయి.  ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ కూడా ఆ బిల్లులను వ్యతిరేకించడమే కాక కేంద్రప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌ చేత రాజీనామా కూడా చేయించి నిరసన తెలియజేసింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా లోక్‌సభలో రెండు బిల్లులను మూజూవాణీ ఓటుతో ఆమోదింపజేసుకొంది. 

కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన ఈ రెండు వ్యవసాయ బిల్లులు దేశంలో రైతులకు మరింత మేలు చేస్తాయని, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకొనేందుకు వెసులుబాటు కల్పిస్తాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ చెప్పారు. ఈ బిల్లుల వలన రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలుగదని, కనీస మద్దతు ధరలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని తెలిపారు. 

ఈ రెండు బిల్లులు దేశంలో రైతులకు లబ్ది చేకూర్చేందుకు తెచ్చినవే తప్ప రైతులకు నష్టం కలిగించవని నేను హామీ ఇస్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. కొన్ని రాజకీయ శక్తులు వీటిపై రాద్దాంతం చేస్తూ ప్రజలలో అపోహలు సృష్టించి వారిని తప్పు దోవపట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆవేదన వ్యక్తం చేశారు. 

హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌ స్పందిస్తూ, “ఒక రైతు బిడ్డగా, అన్నదాత సోదరిగా వారి ప్రయోజనాలను కాపాడే ప్రయత్నంలో నేను నా మంత్రి పదవికి రాజీనామా చేయడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది,” అని ట్వీట్ చేశారు. గురువారం మధ్యాహ్నం ఆమె తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపించారు. 

హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేసినందున అకాలీదళ్ పార్టీ ఎన్డీయేలో కొనసాగాలా వద్దా అనే దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆమె భర్త, లోక్‌సభ సభ్యుడు, ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్ బీర్‌ సింగ్‌ బాదల్ చెప్పారు. 


Related Post