నన్ను హత్య చేస్తానని బెదిరించారు: ప్రొఫెసర్ నాగేశ్వర్‌

August 07, 2020


img

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు గుర్తుతెలియని వ్యక్తి హత్య చేస్తానని బెదిరించాడు. ఈవిషయం ఆయనే స్వయంగా మీడియాకు తెలియజేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ రావు రాష్ట్ర, జాతీయ స్థాయి ఆర్ధిక, రాజకీయ, సామాజిక అంశాలపై మీడియా వేదికగా జరిగే చర్చలలో పాల్గొంటూ చాలా సునిశితంగా విశ్లేషిస్తుంటారు. చాలా మంది రాజకీయ విశ్లేషకులలాగా ఆయన ఏదో ఓ పార్టీకో, వర్గానికో అనుకూలంగా వ్యవహరించకుండా చాలా నిష్పక్షపాతంగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను చెపుతుంటారు. కనుక సహజంగానే ఆయనకు శత్రువులు ఎక్కువుంటారు. అటువంటివారే ఎవరో ఆయనకు ఫోన్‌ చేసి హత్య చేస్తానని బెదిరించి ఉండవచ్చు. 

ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “గత నెల 25న గుర్తు తెలియనివ్యక్తులు నాకు పదేపదే ఫోన్‌ చేసి సామాజిక మాధ్యమాలలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడున్నానని ఆరోపిస్తూ బూతులు తిట్టారు. ఒకవేళ నేను బయట దొరకకపోతే నా ఇంటికే వచ్చి హత్య చేస్తానని బెదిరించారు. ఆ రోజు కనీసం 7-8 సార్లు ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ కాల్స్ చేసి నన్ను పదేపదే బెదిరించారు. నేను వెంటనే హాక్-ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ తరువాత నేను ఈవిషయాన్ని డిజిపి, సిపిల దృష్టికి తీసుకువెళ్ళేందుకు చాలా ప్రయత్నించాను. కానీ వారు అందుబాటులో లేరు. నేటికీ పోలీసులు ఇంతవరకు స్పందించలేదు. నావంటి వారికే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అయినా ఇటువంటి బెదిరింపులకు నేను భయపడను. మరింత ఉత్సాహంగా సామాజిక, ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడుతాను,” అని అన్నారు.


Related Post