అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం!

August 07, 2020


img

కరోనా మహమ్మారి కారణంగా అగ్రరాజ్యంగా వెలుగుతున్న అమెరికా ఆర్ధిక, పారిశ్రామిక, సామాజిక వ్యవస్థలు  దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షలాది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అంతేకాక ఈ విపరీత పరిణామాలతో అధ్యక్షుడు ట్రంప్‌ రాజకీయ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. అందుకే దీనికంతటికి కారణమైన చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకరేచ్చతో రగిలిపోతున్నారు. దేశంలో కరోనా ప్రవేశించిన తరువాత చైనా పట్ల అమెరికా దృక్పధంలో చాలా మార్పు వచ్చిందని డోనాల్డ్ ట్రంప్‌ స్వయంగా చెప్పారు. అమెరికాను, వ్యక్తిగతంగా తనను ఇంతగా దెబ్బతీస్తున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలనే సంకల్పంతో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌, దేశంలో 45 రోజుల తరువాత టిక్‌టాక్‌ను నిషేదిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై గురువారం సంతకం చేశారు. 

టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేదం విధించబోతున్నట్లు ట్రంప్‌ ఇదివరకే హెచ్చరించడంతో దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ తన కార్యాలయాన్ని అమెరికాలో ఏర్పాటుచేసుకొనేందుకు సిద్దపడింది. కానీ అమెరికాలో ఉన్నాకూడా దాని చైనా మూలాల కారణంగా అమెరికా రక్షణ, భద్రతకు ప్రమాదమే కనుక ఆ ప్రతిపాదనకు ట్రంప్‌ ప్రభుత్వం విముఖత చూపింది. 

దీనిని ఒక గొప్ప వ్యాపార అవకాశంగా భావించిన మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్‌టాక్‌ను కొనుగోలుచేసేందుకు ముందుకు వచ్చింది. దానికి ట్రంప్‌ కూడా సానుకూలంగా స్పందించడంతో మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు ప్రారంభించింది. 

అయితే బైట్‌డ్యాన్స్‌ మళ్ళీ ఏమైనా కొత్త ఎత్తుగడలు వేసి మైక్రోసాఫ్ట్ సంస్థతో భాగస్వామ్యం కోసం ప్రయత్నించవచ్చని అనుమానించిన ట్రంప్‌ దానికి అటువంటి అవకాశం లేకుండా చేస్తూ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దాని ప్రకారం గురువారం నుంచి 45 రోజులలోపుగా మైక్రోసాఫ్ట్- బైట్‌డ్యాన్స్‌ సంస్థల మద్య చర్చల ప్రక్రియ ముగించి, టిక్‌టాక్‌ను పూర్తిగా మైక్రోసాఫ్ట్ సంస్థ స్వాధీనం చేసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత మైక్రోసాఫ్ట్ సంస్థతో సహా అమెరికాలో ఎవరూ కూడా బైట్‌డ్యాన్స్‌ సంస్థతో ఎటువంటి లావాదేవీలు జరిపినా నేరంగా పరిగణించబడుతుంది. కనుక సెప్టెంబర్ 20 తరువాత అమెరికాలో చైనాకు చెందిన టిక్‌టాక్‌ ఉండదు. ఒకవేళ ఉంటే అది మైక్రోసాఫ్ట్ సొంతది మాత్రమే అయ్యుంటుంది. 

మన దేశంలో ఇప్పటికే టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన అనేక మొబైల్ యాప్‌లను కేంద్రప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. దీంతో టిక్‌టాక్‌ భారీగా నష్టపోయింది.  ఇప్పుడు అమెరికా నుంచి కూడా గెంటివేయబడటంతో ఇంకా నష్టపోనుంది.    

భారత్‌లో టిక్‌టాక్‌ మళ్ళీ అడుగుపెట్టకుండా అడ్డుకోవాలంటే ఇప్పుడు అమెరికా పాటిస్తున్న విధానాన్నే భారత్‌ కూడా అనుసరించడం అవసరం. లేకుంటే ఏదైనా భారతీయ సంస్థతో ఒప్పందం చేసుకొని వేరే పేరుతో కొనసాగే ప్రయత్నం చేయవచ్చు.


Related Post