సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

August 05, 2020


img

రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చేపట్టడంపై స్టే విధించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మంగళవారం రాత్రి ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డు నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను, కృష్ణా ట్రిబ్యూనల్ ఆదేశాలను పట్టించుకోకుండా టెండర్ల ప్రక్రియ చేపట్టిందని కనుక దానిపై స్టే ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. 

శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ నుంచి ఏపీ ప్రభుత్వం కృష్ణానది జలాలను వినియోగించుకొనేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నీటి నిలువ సామర్ధ్యం పెంచాలని భావిస్తోంది. ఆ నీటిని రాయలసీమలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న జిల్లాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కానీ దాంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో నీటి సమస్యలు ఏర్పడతాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కనుక ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ పనుల కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఒకటి రెండు రోజులలో ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.


Related Post