అందుకే సిఎం కేసీఆర్‌ సమావేశం వాయిదా: బండి సంజయ్

August 01, 2020


img

రెండు తెలుగు రాష్ట్రాల మద్య జలవివాదాలపై చర్చించి, సమస్యలు పరిష్కరించుకొనేందుకు ఈనెల 5వ తేదీన కేంద్రప్రభుత్వం ఇరువురు ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని భావించింది. కానీ దానిని ఈనెల 20వరకు వాయిదా వేయాలని సిఎం కేసీఆర్‌ కోరారు. 

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, “దీని కోసం సిఎం కేసీఆర్‌ డిల్లీ వెళ్ళక్కరలేదు. ప్రగతి భవన్‌లోనే ఒక అరగంటసేపు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటే సరిపోతుంది. కానీ దానికీ ఆయనకు ఖాళీ లేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ పనుల కోసం టెండర్లు పిలిచింది. అవి ఈనెల 17న ఖరారు కానున్నాయి. బహుశః ఆ ప్రక్రియను పూర్తిచేసుకొనేందుకు ఏపీ ప్రభుత్వానికి  వెసులుబాటు కల్పించేందుకే సిఎం కేసీఆర్‌ అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదావేసి ఉంటారని అనుమానం కలుగుతోంది. టెండర్లు ఖరారయ్యి పనులు కూడా మొదలయ్యాక అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఏమి ప్రయోజనం? అప్పటికే జరుగవలసిన నష్టం జరిగిపోతుంది కదా?సిఎం కేసీఆర్‌ తెలంగాణ హక్కులు కాపాడటంలో విఫలమయ్యారు. ఆయనకే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు పనులకు జీవో జారీ చేసినప్పుడే అభ్యంతరం చెపుతూ ఏపీ ప్రభుత్వానికి లేఖ వ్రాసి ఉండాల్సింది. కానీ టెండర్ల ప్రక్రియవరకు వచ్చేసినా అడ్డుకోలేకపోయారు. కనుక సిఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే ఆగస్ట్ 5వ తేదీనే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని మన అభ్యంతరాలు చెప్పాలి,” అని అన్నారు.


Related Post