నర్సింహులుని కాంగ్రెస్‌ నేతలే ఆత్మహత్యకు ప్రేరేపించారు

July 31, 2020


img

సిఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్లోని వర్గల్ మండలం వేలూరులో బ్యాగరి నర్సింహులు (38) పురుగుల మందు త్రాగి చనిపోవడం చాలా బాధాకరం. దానిపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం విస్మయం కలిగిస్తుంది. నిరుపేద దళిత రైతు నర్సింహులకు చెందిన 13 గుంటల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదిక నిర్మించాలనుకోవడంతో సమస్య మొదలైంది. రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారం చేజిక్కించుకొన్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం, దళితుల భూములు గుంజుకొంటోందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సిఎం కేసీఆర్‌ హయాంలో రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. నర్సింహులు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. 

ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై మంత్రి హరీష్‌రావు ఘాటుగా స్పందించారు. గురువారం గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నర్సింహులు ఆత్మహత్యలు చేసుకోవ్డం చాలా బాధాకరం. దానిపై కాంగ్రెస్‌ నేతలు రాజకీయాలు చేయడం ఇంకా బాధాకరం. వాస్తవమేమిటంటే, నర్సింహులుకు వారసత్వంగా వచ్చిన భూమిన రాజేష్ అనే వ్యాపారికి 2014లోనే అమ్మేశాడు. అది అసైన్డ్ ల్యాండ్ కావడంతో ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకొని దానిలో ఒక ఎకరంలో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మించింది. ఆ స్థలంలో ఇంకా మిగిలిన 13 గుంటల భూమిలో ప్రభుత్వం రైతు వేదిక నిర్మించాలనుకొంది. కానీ స్థానిక కాంగ్రెస్‌ నేతలు నర్సింహులును రెచ్చగొట్టడంతో అతను ఆ భూమి తనదేనంటూ వాదన మొదలుపెట్టాడు. ఆవేశంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని కాల్ డేటా ఆధారంగా అతనిని ఎవరు రెచ్చగొట్టారో కనుగొని నేరస్తులకు శిక్ష పడేలా చేస్తాము. నర్సింహులు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. అతని కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2 లక్షలు నష్టపరిహారం, త్వరలో ఒక ఎకరం భూమి ఇస్తాము. నర్సింహులు కుమార్తె చదువుకయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది,” అని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎవరికీ ఈవిధంగా నష్టపరిహారం చెల్లించలేదు. కానీ నర్సింహులు కుటుంబానికి సాయం చేస్తోంది. అంటే నర్సింహులుకు అన్యాయం జరిగిందని అర్ధమవుతోందని కాంగ్రెస్‌ నేతల వాదన. అతను దళితరైతు కనుక ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళితే ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది కనుకనే ప్రభుత్వం హడావుడిగా నర్సింహులు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఉండవచ్చని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు. 


Related Post