విశాఖ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

July 14, 2020


img

విశాఖపట్నం శివారులో పరవాడ వద్ద గల ఫార్మాసిటీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక, వైద్య తదితర వ్యర్ధాలను నిర్మూలించే రాంకీ కోస్టల్ వేస్ట్ మేనేజిమెంట్‌కు చెందిన సాల్వెంట్ కంపెనీలో సోమవారం రాత్రి సుమారు 10.30 గంటలకు రియాక్టర్ పేలిపోవడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. రాత్రి డ్యూటీలో ఉన్న కెమిస్ట్ మల్లేష్ (42) ఒక్కరే గాయపడ్డారు. వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని 8 ఫైర్ ఇంజన్లతో సుమారు రెండున్నర గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగినప్పుడు పరవాడలో భారీగా వర్షం కురుస్తుండటంతో మంటలు వ్యాపించలేదు లేకుంటే మరింత ఆస్తినష్టం జరిగి ఉండేది. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమీషనర్ ఆర్కే మీనా, విశాఖ జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తదితరులు హుటాహుటిన అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.     

సుమారు రెండు నెలల క్రితమే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో నుంచి విషవాయువు వెలువడటంతో 12 మంది చనిపోగా, సుమారు 300 మంది అస్వస్థులయ్యారు. మళ్ళీ ఇప్పుడు విశాఖలోనే మరో పారిశ్రామిక ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో సుమారు 85 ఫార్మా కంపెనీలున్నాయి. కానీ ఫార్మా సిటీ సమీపంలోనే అగ్నిమాపక దళం సిద్దంగా ఉండటంతో వారు వెంటనే వచ్చి మంటలను అదుపుచేయడంతో ఇతర పరిశ్రమలకు ఎటువంటి నష్టమూ జరుగలేదు.  నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగకపోవడం చాలా అదృష్టమనే చెప్పాలి.



Related Post