సచివాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

July 11, 2020


img

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు సోమవారం వరకు స్టే విధించడంతో అధికారులు కూల్చివేతపనులు నిలిపివేశారు. ఈ అంశంపై హైకోర్టులో సోమవారం మళ్ళీ విచారణ జరుగనుండగా, కొత్త సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. 

ప్రభుత్వం తీసుకొనే ఇటువంటి విధానపరమైన నిర్ణయాలలో సాధారణంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవు కానీ సాంకేతికపరమైన కారణాలను చూపినట్లయితే జోక్యం చేసుకొంటుంటాయని హైకోర్టు జారీ చేసిన తాజా స్టే ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ మరియు కాలుష్య నియంత్రణమండలి అనుమతులు తీసుకోలేదని, సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ (ఘన వ్యర్ధాలు అంటే భవనాల శిధిలాలు)ను ఏమి చేయబోతోంది?వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోకుండా హడావుడిగా కూల్చివేత పనులు మొదలుపెట్టిందని పిటిషనర్‌ చేసిన ఆరోపణలపై సానుకోళంగా స్పందించిన హైకోర్టు వాటిపై ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని కోరుతూ సోమవారం వరకు సచివాలయం కూల్చివేతపనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, రాష్ట్రంలో భారీ భవనాలు నిర్మించబడుతున్నట్లే కొత్త సచివాలయం కూడా నిర్మించబడుతుంది కనుక దానికి సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పకపోవచ్చు.


Related Post