తెలంగాణకు ఈ తుపాకి రాముడు పనికిరాడు: బిజెపి

July 10, 2020


img

తెలంగాణ బిజెపి అధ్వర్యంలో ‘జన్ సంవాద్’ పేరిట ఆన్‌లైన్‌లో సభలు జరుగుతున్నాయి. ఈరోజు నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల నేతలు, కార్యకర్తలు ఈ ‘ఆన్‌లైన్‌ వర్చువల్ ర్యాలి’ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సచివాలయంలో నల్లపోచమ్మ గుడిని అర్ధరాత్రిపూట కూలగొట్టించి, భవనాలు కూలుస్తున్నప్పుడు గుడి దెబ్బతిందని సిఎం కేసీఆర్‌ అబద్దాలు చెపుతున్నారు. పోచమ్మగుడిని కూలద్రోసిన కేసీఆర్‌ హిందువునని ఎలా చెప్పుకోగలరు? గుడి కూలద్రోయడంతోనే ఆయనకు కౌంట్ డౌన్‌ మొదలైపోయింది. ఇక కేసీఆర్‌కు రోజులు దగ్గరపడినట్లే! త్వరలోనే ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టి 24 గంటలు అగ్గి మీద నిలబెడతాము.  

 ప్రజలు కరోనాతో తీవ్ర ఆందోళన చెందుతుంటే వారి మద్యన ఉండి ధైర్యం చెప్పవలసిన సిఎం కేసీఆర్‌ కనబడకుండా మాయం అయిపోయారు. ఆసుపత్రులలో బెడ్లు దొరకావు... ఆక్సిజన్ ఉండదు...రోగులను పట్టించుకొనే నాధుడే లేడు. కనీసం ఐసీఎంఆర్‌ సూచించిన మార్గదర్శకాలనైనా తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా ఆచరణలో పెట్టలేకపోయింది. అందుకే నేడు రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో కరోనాను కట్టడిచేయడంలో సిఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారు. 

అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి తుపాకి పేల్చినట్లు మాట్లాడే ఈ తుపాకీ రాముడుతో తెలంగాణ అభివృద్ధి చెందదు. ధైర్యంగా ముందుండి రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపించేవ్యక్తి ఇప్పుడు తెలంగాణకు చాలా అవసరం. అటువంటి వ్యక్తిని బిజెపి మాత్రమే అందించగలదు. ఎందుకంటే బిజెపి కమీషన్లు, కాంట్రాక్టర్ల పార్టీ కాదు. ప్రజల కోసం... దేశం కోసమే పనిచేసే పార్టీ కనుక. అందుకు ప్రధాని నరేంద్రమోడీ పాలనే ఒక చక్కటి ఉదాహరణ. ఆయన నేతృత్వంలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచదేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది,” అని మురళీధర్ రావు అన్నారు. 


Related Post