సచివాలయం కూల్చివేతకు మళ్ళీ బ్రేక్

July 10, 2020


img

తెలంగాణ సచివాలయం కూల్చివేతపనులకు మళ్ళీ బ్రేక్ పడింది! కూల్చివేత సమయంలో వ్యాపిస్తున్న దుమ్ముదూళితో పరిసర ప్రాంతాలలో నివశిస్తున్న సుమారు 5 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని, లాక్‌డౌన్‌ ఆంక్షలను పట్టించుకోకుండా కూల్చివేత పనులు చేపట్టారని పిటిషనర్ ఆరోపించారు. మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విధివిధానాలకు విరుద్దంగా కూల్చివేత పనులుసాగుతున్నాయని హైకోర్టుకు తెలిపారు. 

ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరిగినప్పుడు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదిస్తూ, గతంలో దీనిపై నమోదైన అన్ని పిటిషన్లపై హైకోర్టు సుదీర్గంగా విచారణ జరిపిన తరువాతే సచివాలయం కూల్చివేతకు అనుమతించిందని గుర్తుచేశారు. హైకోర్టు అనుమతించిన తరువాతే కూల్చివేత పనులు ప్రారంభించామని ఇప్పటికే 60 శాతంపైగా భవనాలు కూల్చివేయబడ్డాయని కనుక ఈ దశలో పనులు నిలిపివేయడం సరికాదని హైకోర్టును అభ్యర్ధించారు. కానీ కూల్చివేతపనులకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకొందో సోమవారంలోగా తెలియజేయాలంటూ అప్పటివరకూ సచివాలయం కూల్చివేత పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

సచివాలయం ఆవరణలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదును కూల్చివేసినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై సిఎం కేసీఆర్‌ స్పందించారు. పాత సచివాలయం స్థానంలో కొత్తది నిర్మించాలనుకొన్నామే తప్ప గుడి, మసీదును కూల్చివేయాలని ఎన్నడూ భావించలేదని, కానీ భవనాల కూల్చివేస్తున్నప్పుడు శిధిలాలు వాటిపై పడి కొంత దెబ్బతిన్నాయని తనకు తెలిసిందని సిఎం కేసీఆర్‌ అన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తాను చాలా ఆవేదన చెందానని, అయితే వాటి స్థానంలో ఇంకా పెద్దవి, విశాలమైనవి ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించి ఇస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది.


Related Post