మజ్లీస్‌తో కలిస్తే కరోనా వస్తుందా? తలసాని ప్రశ్న

July 09, 2020


img

ప్రగతి భవన్‌ సిబ్బందికి కరోనా సోకడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా గజ్వేల్లోని తన నివాసానికి తరలిపోవడంతో గతవారం రోజులుగా ఆయన మీడియా వార్తలలో కనిపించడం లేదు. దాంతో ఆయన కరోనా కట్టడి చేయలేక చేతులెత్తేసారని...రాష్ట్రాన్ని గాలికి వదిలేసి గజ్వేల్‌కు వెళ్లిపోయారని కాంగ్రెస్‌, బిజెపి నేతలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు టిఆర్ఎస్‌ నేతలు ఇప్పటికే ఘాటుగా సమాధానాలు చెపుతున్నారు. 

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈరోజు ఇదే అంశంపై మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి ప్రతీరోజు కనిపించాలని ఏమైనా నిబందనలున్నాయా? ముఖ్యమంత్రి కనబడకపోతే ఆదేమైనా నేరమా...ఘోరమా? సిఎం కేసీఆర్‌ ఇక్కడ హైదరాబాద్‌లో లేకపోయినప్పటికీ పరిపాలన, సంక్షేమ పధకాలు, అభివృద్ధి పనులు ఏవీ ఆగిపోలేదు కదా? కానీ ప్రతిపక్షాలకు ‘సబ్జెక్ట్’ ఏమీ లేకపోవడంతో ప్రతీ చిన్న విషయంపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. సచివాలయం  కూల్చివేతపై కూడా ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు వాగుతున్నాయి. సచివాలయం పరిపాలనావ్యవస్థలో భాగం మాత్రమే. దానిని ఆధునీకరించే క్రమంలో కొత్త సచివాలయం నిర్మిస్తే తప్పేమిటి? కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రం గురించి నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము మజ్లీస్ పార్టీతో కలిస్తే కరోనా వస్తుందా లేకపోతే రాదా?డిల్లీలోనే ఉన్న కేంద్రప్రభుత్వం అక్కడ కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయింది?బిజెపి పాలిత రాష్ట్రాలలో కరోనాను ఎందుకు కట్టడిచేయలేకపోతున్నారు? బిజెపి నేతలే చెప్పాలి,” అని ప్రశ్నించారు.


Related Post