విదేశీ విద్యార్దులకు ట్రంప్‌ సర్కార్ షాక్

July 07, 2020


img

అమెరికాలో లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాదిమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోవడంతో వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ట్రంప్ సర్కార్ ఈ ఏడాది డిశంబర్ వరకు హెచ్-1బీ వీసాల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికాలో చదువుకొంటున్న విదేశీ విద్యార్దులను కూడా స్వదేశాలకు పంపించేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం సిద్దం అవుతోంది. కరోనా నేపధ్యంలో ఇప్పుడు చాలా యూనివర్సిటీలు, కాలేజీలు తమ విద్యార్దులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నందున విద్యార్దులు హాస్టల్స్ లేదా వారి రూములలో ఉంటూ చదువుకొంటున్నారు. అటువంటప్పుడు వారు అమెరికాలోనే ఉండాల్సిన అవసరం లేదు. తమ తమ దేశాలలోనే ఉంటూ ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకావచ్చు 

కనుక నేరుగా తరగతులకు హాజరుకాని విద్యార్దులందరూ అమెరికా విడిచివెళ్లాల్సి ఉంటుందని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఒకవేళ విద్యార్దులు అమెరికాలోనే ఉండి చదువుకోవాలనుకొంటే ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించే కాలేజీ లేదా యూనివర్సిటీకి బదిలీ చేయించుకోవలసి ఉంటుందని తెలిపింది. అమెరికాలో చట్టబద్దంగా ఉండాలనుకొంటే ఇది తప్పనిసరని లేకుంటే విద్యార్దులు అక్రమంగా అమెరికాలో నివశిస్తునట్లు పరిగణించి వారిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. అలాగే ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలలో చేరదలుచుకొన్న విద్యార్దులకు ఇకపై వీసాలు జారీ చేయబోమని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) స్పష్టం చేసింది. 

ట్రంప్‌ సర్కార్ నిర్ణయంతో లక్షలాదిమంది విద్యార్దులు తక్షణమే అమెరికా విడిచి స్వదేశాలకు తిరిగివెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడటంతో విద్యార్దులు వారి తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌ సర్కార్ తీసుకొంటున్న ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలతో అమెరికాలో స్థిరపడి ఓటు హక్కుకలిగిన లక్షలాదిమంది విదేశీయులలో ట్రంప్‌కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో అమెరికన్లను...దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఇటువంటి కటిన నిర్ణయాలు తీసుకొంటున్నారని అమెరికన్లు భావించినట్లయితే నవంబర్‌ 3న జరుగబోయే అధ్యక్ష ఎన్నికలలో వారు ఆయనకు అనుకూలంగా ఓటువేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష ఎన్నికలకు ముందు డోనాల్డ్ ట్రంప్‌ ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు అమలుచేస్తుండటం విశేషమే. 


Related Post