ఇంట్లో కరోనా చికిత్స సాధ్యమేనా?

July 04, 2020


img

దేశంలో ఇప్పటి వరకు కరోనా రోగులను ఆసుపత్రులలో ఉంచి చికిత్స చేస్తుండటం వలన వారు తొందరగా కొలుకొంటున్నారు. ఆసుపత్రులలో వైద్యులు, వైద్య సిబ్బంది అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ దుస్తులు ధరిస్తుంటారు కనుక వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువే. కానీ ఇప్పుడు అసలు కరోనా లక్షణాలు లేనివారిని, తక్కువ లక్షణాలున్నవారిని ఇళ్ళలోనే ఉంచి చికిత్స అందించాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం వైరస్ వ్యాప్తికి దోహదపడేలా ఉంది. 

కాస్త ఉన్నతవర్గాలవారికి పెద్ద పెద్ద ఇళ్ళు వాటిలో అనేక గదులు ఉంటాయి కనుక వారిని ఇళ్ళలో ఉంచి కరోనా చికిత్స చేయడం పెద్ద సమస్య కాదు. ఒకవేళ వారు అంత రిస్క్ వద్దనుకొంటే తమ స్థాయికి తగ్గట్లుగా ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనో చేరి వైద్యం చేయించుకోగలరు. అంటే ప్రభుత్వం చెపుతున్న ‘ఇంట్లోనే కరోనా చికిత్స ప్రతిపాదన’ మద్యతరగతి ప్రజల కోసమేనని భావించవలసి ఉంటుంది. కానీ మద్యతరగతి ప్రజలలో చాలామంది ఒకటి లేదా రెండు గదులున్న ఇళ్ళలోనే జీవిస్తుంటారు. కనుక వాటిలో ఓ గదిని కరోనా రోగికి ప్రత్యేకంగా కేటాయించడం సాధ్యం కాదు. ఒకవేళ కేటాయించినా ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ ఇంట్లో మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకడం తధ్యం. అప్పుడు ఒకరికి కరోనా సోకితే ఇంట్లో అందరికీ చికిత్స చేయవలసి ఉంటుంది. పైగా వారిద్వారా ఇరుగుపొరుగులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంటుంది. కనుక ఇరుగుపొరుగువారు అభ్యంతరం చెప్పవచ్చు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది తమ ఇళ్ళకు వస్తుంటేనే ఇరుగుపొరుగులు అభ్యంతరం చెపుతున్నప్పుడు, కరోనా రోగిని ఇంట్లో ఉండేందుకు ఒప్పుకొంటారనుకోలేము. కనుక వ్యాధి తీవ్రతను బట్టి కరోనా రోగులను ఆసుపత్రులలోనో లేదా క్వారెంటైన్‌ కేంద్రాలలోనో ఉంచి వైద్యం అందించడమే మంచిది లేకుంటే కొత్త సమస్యలు పుట్టుకురావచ్చు. 


Related Post