లద్దాక్‌లో మోడీ ఆకస్మిక పర్యటన...చైనా అభ్యంతరాలు

July 03, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ, త్రివిద దళాధిపతి బిపిన్ రావత్‌, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలతో కలిసి శుక్రవారం ఉదయం ఆకస్మికంగా లద్దాక్‌లో పర్యటించి సముద్రమట్టానికి సుమారు 11,000 అడుగుల ఎత్తున ఉండే నిము అనే ప్రదేశంలో పహారా కాస్తున్న సైనికులతో మాట్లాడారు. అక్కడే ప్రధాని నరేంద్రమోడీ సైనికాధికారులతో సమావేశమయ్యి సరిహద్దులలో పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ఇటీవల గల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిలో గాయపడి స్థానిక మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ జవాన్లను కూడా పరామర్శించనున్నారు. 

అత్యంత ప్రతికూల పరిస్థితులుండే సరిహద్దుల వద్ద ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జవాన్లకు భరోసా కల్పించడంతో పాటు, చైనాకు గట్టి హెచ్చరికను పంపేందుకే ప్రధాని నరేంద్రమోడీ, బిపిన్ రావత్‌, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలతో కలిసి లద్దాక్‌లో పర్యటించినట్లు భావించవచ్చు. కనుక ఊహించినట్లే వారి పర్యటనపై చైనా తీవ్రంగా స్పందించింది. 

“సరిహద్దులో ఇరుదేశాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొన్నందున, ఇరుదేశాల సైనికాధికారుల మద్య చర్చలు జరుగుతున్నప్పుడు భారత్‌ ప్రధాని గల్వాన్ లోయలోని ‘వివాదాస్పద ప్రాంతాలలో’ పర్యటించడం కవ్వింపు చర్యగానే భావిస్తున్నామని, ఇది సరికాదంటూ,” చైనా విదేశాంగ ప్రతినిధి చావో లిజియన్ శుక్రవారం బీజింగ్‌లో ఓ ప్రకటన చేశారు. 

సరిహద్దులలో పాక్‌, చైనాలు ఎప్పుడూ భారత్‌కు సవాలు విసురుతూనే ఉన్నాయి. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా భారత్‌ ఇప్పుడు ధీటుగా జవాబిస్తుండటమే కాకుండా, ప్రధాని నరేంద్రమోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు స్వయంగా సరిహద్దులవరకు వెళ్ళి ‘ఇది భారత్‌ భూభాగం’ అని పాకిస్థాన్‌, చైనాలకు స్పష్టమైన హెచ్చరికలు పంపిస్తుండటంతో అవి జీర్ణించుకోలేకపోతున్నాయని భావించవచ్చు.


Related Post