కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై ఉగ్రవాదుల దాడి

June 29, 2020


img

ఈరోజు ఉదయం పాకిస్థాన్‌లోని కరాచీలో పాకిస్థాన్‌ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై ఉగ్రవాదుల దాడి చేశారు. ఆ దాడిలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు భద్రతా సిబ్బంది చనిపోయారు. మరో ముగ్గురు పోలీస్ అధికారులు, ఏడుగురు పౌరులు ఈ దాడిలో గాయపడ్డారు.

కరాచీ పోలీసుల సమాచారం ప్రకారం, ఈరోజు ఉదయం 10 గంటలకు నలుగురు ఉగ్రవాదులు ఒక ఒక నల్లరంగుకారులో అక్కడకు చేరుకొని తమవద్ద ఉన్న ఏకే 47 తుపాకులతో విచిక్షణారహితంగా కాల్పులు జరుపుతూ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. కానీ గేటువద్ద ఉన్న భద్రతా సిబ్బందివారిని అడ్డుకోగలిగారు. ఈలోపుగా సమాచారం అందుకొన్న సింధ్ రేంజర్స్ అక్కడకు చేరుకొని ఆ నాలుగురుగు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఉగ్రవాదులు వచ్చిన కారును తనికీలు చేయగా దానిలో మరికొన్ని ఆయుధాలు, గ్రెనేడ్లు వగైరా లభించాయి. చనిపోయిన ఉగ్రవాదుల బ్యాగులలో ఆహార పదార్ధాల ప్యాకెట్లు కూడా లభించాయి. అంటే ఏదోవిధంగా లోపలకు చొచ్చుకుపోయి లోపలున్నవారిని బందీలుగా పట్టుకొని ప్రభుత్వాన్ని ఏదో డిమాండ్ చేయాలనివారు ప్లాన్ చేసుకొని ఉండవచ్చని ఓ పోలీస్ అధికారి చెప్పారు.

ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించుకోలేదు. కరాచీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు, నిఘా బృందాలు ఘటనస్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. భారత్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి పాక్‌ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచిపోషిస్తుంటే వారు పాకిస్థాన్‌లోనే దాడులు చేస్తూ ప్రభుత్వానికి ఈవిధంగా సవాలు విసురుతున్నారు.


Related Post