సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

June 29, 2020


img

తెలంగాణ సచివాలయం కూల్చివేయడానికి హైకోర్టు ఆమోదం తెలిపింది. సచివాలయం కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మొత్తం 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే పలుమార్లు వాటిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం జరిగిన తుది విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తున్నట్లు తీర్పు చెప్పడమే కాక కొత్త సచివాలయం నిర్మించాలనే మంత్రివర్గ నిర్ణయాన్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. 

నిజానికి గత ఏడాది డిసెంబరులోగానే సచివాలయం కూల్చివేసి దాని స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణ పనులు మొదలుపెట్టాలనే ఉద్దేశ్యంతో జూన్ 27న సిఎం కేసీఆర్‌ కొత్త సచివాలయ నిర్మాణపనులకు శంఖుస్థాపన చేశారు. ఆ తరువాత నగరం నడిబొడ్డున ఉన్న బీఆర్‌కె భవన్‌ను తాత్కాలిక సచివాలయంగా ఎంచుకొని దానిలోకి ముఖ్యమైన అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను తరలించారు. మరికొన్నిటిని నగరంలో ఇతర భవనాలలోకి తరలించారు. అప్పటి నుంచి సచివాలయం ఖాళీగానే ఉంది. కానీ సచివాలయం కూల్చివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలవడంతో సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే విధించి విచారణ చేపట్టింది. 

ఇప్పుడు అన్ని అవరోధాలు తొలగిపోయినందున, ఒకవేళ పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్ళకపోతే, సచివాలయం కూల్చివేతకు మార్గం సుగమం అయినట్లే భావించవచ్చు. దీని కోసమే ప్రభుత్వం ఇంతకాలంగా ఎదురుచూస్తోంది కనుక త్వరలోనే కూల్చివేత పనులు మొదలుపెట్టవచ్చు. ఇప్పటికే కొత్త సచివాలయ భవనం డిజైన్లు కూడా ప్రభుత్వం చేతికి వచ్చాయి. సచివాలయం కూల్చివేత పనులు ముగిసేలోగా వాటిలో ఒకటి ఖరారు చేసి టెండర్లు పిలిచి వెంటనే నిర్మాణపనులు కూడా మొదలుపెట్టవచ్చు. 


Related Post