వీకే సింగ్‌పై బదిలీ వేటు!

June 29, 2020


img

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఏడీజీ వీకే సింగ్‌పై బదిలీవేటు పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్యక్షుడుగా ఉన్న వివి శ్రీనివాస్ రావుకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించి, వీకే సింగ్‌ను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించారు. 

డిజిపి పదవి ఆశిస్తున్న వీకే సింగ్‌కు అది లభించకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ కారణంగానే ఆయన ముందుగానే పదవీ విరమణ చేసేందుకు సిద్దపడి ఈ నెల 24న కేంద్రహోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ కూడా వ్రాశారు. ఈ ప్రభుత్వంలో ఇమడలేకపోతున్నానని కనుక తనకు వీలైనంత త్వరగా తనను రిలీవ్ చేయాలని ఆ లేఖలో కోరినట్లు తెలుస్తోంది. ఆయన బదిలీకి ఇదొక కారణం కాగా తెలంగాణ పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా బారిన పడ్డారని ఆయన ఆదివారం మీడియాకు తెలియజేయడం మరో కారణంగా కనిపిస్తోంది. ఇటువంటి విషయాలు ప్రభుత్వానికి తెలియజేయకుండా నేరుగా మీడియాకు తెలియజేయడంతో వీకే సింగ్‌పై బదిలీవేటు పడి ఉండవచ్చు. అయితే పదవీ విరమణకు సిద్దపడి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవిధంగా మాట్లాడుతున్న వీకే సింగ్‌పై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొంటుందో చూడాలి.


Related Post