పది పరీక్షలపై హైకోర్టు సందేహాలు

June 05, 2020


img

ఈ నెల 8వ తేదీ నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించవలసి ఉండగా, వాటిపై ఇంకా హైకోర్టులో విచారణ కొనసాగుతుండటంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేదా? అని విద్యార్దులు, తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. మార్చి 19న 10వ తరగతి పరీక్షలు మొదలవగా కరోనా కారణంగానే వాయిదాపడ్డాయి. కానీ సుమారు రెండున్నర నెలల తరువాత నేటికీ ఇంకా అటువంటి పరిస్థితులే నెలకొని ఉండటం, ఇప్పట్లో కరోనా నివారణ అయ్యే అవకాశాలు లేకపోవడంతో కరోనా పడగ నీడనే పరీక్షలను నిర్వహించవలసివస్తోంది. కనుక విద్యార్దులకు కరోనా సోకకుండా పరీక్షలకు నిర్వహించడం విద్యాశాఖకు కత్తిమీద సాముగా మారింది.

10వ తరగతి పరీక్షలు నిర్వహణపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ప్రభుత్వం తరపు హాజరైన అడ్వకేట్ జనరల్ బీఎస్, ప్రసాద్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులకు కరోనా సోకకుండా ప్రభుత్వం తీసుకొన్న జాగ్రత్తలను కోర్టుకు వివరించారు. అయితే కంటెయిన్మెంట్ జోన్లలో చిక్కుకొన్న విద్యార్దులు ఇప్పుడు పరీక్షలు వ్రాయలేకపోతే వారి పరిస్థితి ఏమిటనే న్యాయస్థానం ప్రశ్నకు, విద్యాశాఖను సంప్రదించి రేపు సమాధానం చెపుతామని బీఎస్ ప్రసాద్ చెప్పడంతో దీనిపై విచారణ రేపటికి వాయిదా వేసింది. 

 పరీక్షల నిర్వహణే కాదు...వచ్చే నెలలో పాఠశాలలు, కాలేజీలు తెరిచినప్పుడు కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా ప్రాధమిక పాఠశాలలో చిన్నారులు రాకపోకలు సాగించాలి? వారికి ఏవిధంగా తరగతులు నిర్వహించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా నేపధ్యంలో పాఠశాలలు, కాలేజీలలో ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనే విషయాలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ కూడా చాలా లోతుగా ఆలోచించి ఇప్పటి నుంచే అందుకు తగిన ఏర్పాట్లు, మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుంది. 


Related Post