జూన్ 11నుంచి తిరుమల భక్తులకు అనుమతి

June 05, 2020


img

లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రెండున్నర నెలలుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించలేదు. ఈ నెల 8 నుంచి ఆలయాలు తెరుచుకొనేందుకు కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం భక్తులను కొండపైకి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈరోజు మధ్యాహ్నం దీనికి సంబందించి మార్గదర్శకాలు ప్రకటించారు. 

ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా టీటీడీ ఉద్యోగులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. దర్శనవిధానంలో ఏవైనా లోటుపాట్లు గుర్తిస్తే వెంటనే సరిదిద్దుతారు. ఈనెల 10 నుంచి తిరుపతిలో నివశిస్తున్న స్థానికులకు దర్శనం కల్పిస్తారు. ఈనెల 11 నుంచి దేశవ్యాప్తంగా భక్తులందరికీ అనుమతి. అయితే రోజుకు 3,000 దర్శనం టికెట్లు మాత్రమే జారీ చేయబడతాయి.

 ప్రతీరోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 వరకు మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4వరకు అలిపిరి కాలినడక దారిలో భక్తులను అనుమతిస్తారు. ఉదయం 6.30 నుంచి 7.30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. కాటేజీలలో ఒక్కరోజు మాత్రమే ఉండేందుకు అనుమతి. ఒక గదిలో ఇద్దరికే అనుమతి. మాస్కూలు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి. కొండపై నిరంతరంగా శానిటైజేషన్ ప్రక్రియ నిర్వహించబడుతుంది. 

ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్స్ బుక్‌ చేసుకొన్నవారికి కొండ క్రింద అలిపిరిలో ధర్మల్ స్క్రీనింగ్ వగైరా పరీక్షలు చేస్తారు. ఒకవేళ కరోనా లక్షణాలు కనబడితే ఎంత దూరం నుంచి వచ్చినా వెనక్కు తిరిగి వెళ్ళిపోవలసిందే. పదేళ్ళలోపు పిల్లలను, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులను కొండపైకి అనుమతించరు. కంటెయిన్మెంట్ జోన్ల నుంచి వచ్చే భక్తులను కొండపైకి అనుమతించరు. శ్రీవారి ఆలయంలోగల ఉపాలయాలలో దర్శనాలకు అనుమతించరు. శ్రీవారి పుష్కరిణిలో స్నానాలకు అనుమతి లేదు. కొండపై ప్రైవేట్ హోటల్స్ కు అనుమతి లేదు. శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చేందుకు అనుమతి లేదు. 


Related Post